సాక్షి, విశాఖపట్నం : అభివృద్ధి పనులకు సమైక్యసెగ తగిలింది. అన్ని ప్రభుత్వశాఖల్లో కీలకమైన ఫైళ్లతోపాటు వివిధ కార్యకలాపాలు ఆగిపోయాయి. వివిధశాఖల ఉన్నతాధికారులు విధుల్లో ఉన్నా కిందిస్థాయి సిబ్బంది ఉద్యమంలో మమేకం కావడంతో ఏపనీ ముందుకుసాగడం లేదు. అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల పథకం(ఏసీడీపీ)లో ఒక్కో ఎమ్మెల్యేలకు ఏటా రూ.కోటి జిల్లా ముఖ్య ప్రణాళిక విభాగం ద్వారా విడుదలవుతాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు మూడోవిడతగా రూ.4కోట్ల వరకు ఈపాటికే మంజూరుకావాలి. సమ్మెకారణంగా వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేల ప్రతిపాదనలు కాగితాల్లో మూలుగుతున్నాయి.
జిల్లాపరిషత్ రోడ్ల నిర్మాణం,చెరువుల తవ్వకం,మంచినీటి ట్యాంకుల నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు పుష్కలంగా నిధులున్నా..కిందిస్థాయి సిబ్బందిలేక మండలాల్లో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. మండలాల్లో రెవెన్యూ సిబ్బంది విధులకు దూరంగా ఉండటంతో వివిధ ధ్రువపత్రాల జారీ ఆగిపోయింది. వ్యవసాయశాఖలో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది. జిల్లా, మండల స్థాయి సిబ్బందంతా విధులకు దూరంగా ఉండటంతో ఖరీఫ్ రైతులకు క్షేత్రస్థాయిలో సూచనలు,వివిధ విత్తనాలు,యూరియా లభ్యత అందించేవారు లేకుండాపోయారు.
మండలాల వారీ వర్షపాత వివరాల నమోదు 25రోజులుగా నిలిచిపోయింది. దీంతో వర్షాభావ పరిస్థితులపై అధికారులు ఒక అంచనాకు రాలేక తలపట్టుకుంటున్నారు. కరవు పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేని దుస్థితి. జిల్లా పరిశ్రమలశాఖ, ఏపీఐఐసీలకు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు పెద్ద ఎత్తున వచ్చిపడ్డాయి. సిబ్బంది సమ్మెతో దరఖాస్తులన్నీ మూలుగుతున్నాయి. కంపెనీల విస్తరణ అనుమతులు,కొత్త ప్రతిపాదనల పరిశీలన ప్రక్రియ నిలిచిపోవడంతో అనేక కంపెనీల ప్రతినిధులు చక్కర్లు కొడుతున్నారు.
ఖజానా ఖాళీ
ఖజానా శాఖలో సిబ్బంది సమ్మెతో ఎక్సైజ్,రవాణా వంటి కీలక శాఖల నుంచి నిధులు ఖజానాకు జమ కావడంలేదు. సుమారు రూ.180 కోట్లకుపైగా ఖజానాకు చేరకుండా నిలిచిపోయాయి. ఉపాధిహామీ కూలీలకు కొన్ని రోజులుగా చెల్లిపులు నిలిచిపోయాయి. సిబ్బంది సమ్మెతో క్షేత్రస్థాయిలో కూలీలకు పని కల్పన నుంచి మస్తర్ల వరకు ఏదీ ముందుకు వెళ్లడంలేదు. ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జిల్లా అధికారులు పరిశ్రమల్లో ప్రమాద పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు ప్రత్యేక చట్టం తయారు చేయాలని భావించారు. కిందిస్థాయి సిబ్బంది సమ్మె కారణంగా పనులు పూర్తిగా వాయిదాపడ్డాయి. జిల్లాలో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది.
ఆస్పత్రుల్లో వైద్యులున్నప్పటికీ కిందిస్థాయిలో వ్యాధి నిర్థారణ పరీక్షలకు టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది లేరు. రోడ్లుభవనాల శాఖలో కొత్త రోడ్ల నిర్మాణం,పాతవాటి మరమ్మతులకు రూ.కోట్లలో నిధులు రాలవసి ఉంది. ప్రతిపాదనలు పంపకపోవడంతో ఎక్కడివక్కడే ఆగిపోయాయి. మున్సిపల్ విభాగానికి ఉద్యమ సెగ తీవ్రంగా ఉంది. సిబ్బంది సమ్మె కారణంగా జిల్లాకు రావలసిన13వ ఆర్థికసంఘం నిధులు రూ.62 కోట్లకు ప్రతిపాదనలు తయారుకాలేదు. మొత్తానికి అన్ని శాఖల్లో జిల్లాఅధికారులు నిత్యం కార్యాలయానికి వస్తున్నా మిగతా సిబ్బందిలేక తిరిగి వెళుతున్నారు.
ఎక్కడి పనులు అక్కడే!
Published Fri, Sep 20 2013 2:13 AM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement
Advertisement