ప్రజలకు అండగా నిలుద్దాం
పోలవరం రూరల్ : ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి అండగా నిలుద్దామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తానని, వారికి అనుగుణంగా నడుస్తానని చెప్పారు. పోలవరం మండల నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం పట్టిసం శివక్షేత్రం రేవులో మండల కన్వీనర్ సుంకర వెంకటరెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు అభిప్రాయాన్ని నిర్భయంగా తెలియజేయాలని కోరారు.
అనంతరం నాని మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. మండలస్థాయి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం పోలవరం మండలం నుంచే నాంది పలుకుతానని చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో రాష్ట్ర ఎస్టీ సెల్ కన్వీనర్ తెల్లం బాలరాజు మాట్లాడుతూ చంద్రబాబు బూటకపు హామీలతో ప్రజలను మోసం చేశారన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాలేదని కార్యకర్తలు బాధపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్ అంతా వైఎస్సార్ సీపీదేనని చెప్పారు.
చంద్రబాబు మోసాన్ని ప్రజలు ఇప్పటికే గ్రహించారని చెప్పారు. ప్రతి మండలంలో పర్యటించి కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారన్నారు. పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చల్లా ఆనంద్ ప్రకాష్, అధికార ప్రతినిధులు పోల్నాటి బాబ్జీ, ముప్పిడి సంపత్‌కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, మైగాపుల దుర్గాప్రసాద్, మొగళ్ల హరిబాబు, జెడ్పీటీసీ సభ్యులు ఆకుల సత్యనారాయణ, పిల్లంగోరు దుర్గ, సర్పంచ్ మిడియం గంగాదేవి, బుగ్గా మురళి, సున్నం రాంబాబు, ఉలవల సత్యనారాయణ మూర్తి, తైలం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.