జీఎస్‌టీ తటస్థ రేటుపై కసరత్తు | Centre, states working on new GST rate: Revenue Secy Shaktikanta Das | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ తటస్థ రేటుపై కసరత్తు

Published Tue, Apr 21 2015 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

జీఎస్‌టీ తటస్థ రేటుపై కసరత్తు

జీఎస్‌టీ తటస్థ రేటుపై కసరత్తు

* రాష్ట్రాలతో సంప్రదింపులు  జరుపుతున్నాం
 
*  (జీఎస్‌టీ) రేటును నిర్ణయించనున్న జీఎస్‌టీ మండలి
 
*  కేంద్ర రెవెన్యూ కార్యదర్శి వెల్లడి
న్యూఢిల్లీ: వస్తువులు సేవల పన్ను (జీఎస్‌టీ) తటస్థ రేటుపై కేంద్రం, రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. 2016 ఏప్రిల్ నుంచి జీఎస్‌టీ అమలుకు రంగం సిద్ధం అవుతున్న ప్రక్రియలో భాగంగా  కొత్త రెవెన్యూ తటస్థ రేటును (ఆర్‌ఎన్‌ఆర్) నిర్ణయించడానికి ప్రయత్నం జరుగుతోందన్నారు. ఒకసారి ఆర్‌ఎన్‌ఆర్‌ను నిర్ణయించిన తరువాత, మొత్తంగా జీఎస్‌టీ రేటు అంశాన్ని ‘రాజ్యాంగ సవరణ’కు లోబడి జీఎస్‌టీ మండలి నిర్ణయిస్తుందని శక్తికాంత దాస్ తెలిపారు.
 
ఆర్‌ఎన్‌ఆర్ అంటే...
జీఎస్‌టీ అమలు తరువాత, రాష్ట్రాలకు ఎటువంటి ఆదాయ నష్టం జరక్కుండా చూసేందుకు ఉద్ధేశించిందే ఈ రెవెన్యూ న్యూట్రల్ రేట్. 2014 నవంబర్‌లో ఈ రేటు 27 శాతంగా ఉండాలని జీఎస్‌టీపై సబ్ కమిటీ నిర్ణయించింది. ఇందులో రాష్ట్రాల జీఎస్‌టీ 13.91 శాతంగా ఉండాలని సబ్ కమిటీ సూచించింది. సెంట్రల్ జీఎస్‌టీ 12.77 శాతంగా ఉండాలని సిఫారసు చేసింది. అయితే తదనంతరం సంబంధిత బిల్లులో చోటుచేసుకున్న పలు మార్పులు, చేర్పులు, ప్రతిపాదనల నేపథ్యంలో  రెవెన్యూ న్యూట్రల్ రేట్‌ను పునఃలెక్కింపు జరపాల్సిన పరిస్థితి ఉత్పన్నమయ్యిందని రెవెన్యూ కార్యదర్శి తెలిపారు.

‘ప్రస్తుత ప్రతిపాదిత ఆర్‌ఎన్‌ఆర్ పెట్రోలియం ప్రొడక్టులపై పన్నులను పరిగణనలోకి తీసుకోవడం లేదు. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తరువాత రెండేళ్ల వరకూ ఏదైనా రెవెన్యూ నష్టం సంభవించే పరిస్థితుల్లో... రాష్ట్రాలు వస్తువుల అంతర్రాష్ట సరఫరాలపై ఒక శాతం అదనపు పన్ను విధించే అవకాశం ఉంది. ఆయా అంశాలతో పాటు జీఎస్‌టీ అమలుతో పన్నుల వ్యవస్థలో భారీ ఎత్తుల మార్పులు రానున్నయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆర్‌ఎన్‌ఆర్ పునఃలెక్కించాల్సిన అవసరం ఏర్పడింది’ అని ఉన్నత స్థాయి అధికారి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
 
నేపథ్యం ఇదీ..
వస్తువులు-సేవలపై సెంట్రల్ ఎక్సైజ్, స్టేట్ వ్యాట్, వినోదపు పన్ను, ఆక్ట్రాయ్, ఎంట్రీ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, పర్చేజ్ ట్యాక్స్ స్థానంలో సింగిల్ రేట్‌గా జీఎస్‌టీ అమల్లోకి రానుంది. రాష్ట్ర-కేంద్ర స్థాయిల్లో రెండంచెల్లో ఇది అమలు కానుంది.  దేశ వ్యాప్తంగా పారదర్శక పన్ను వ్యవస్థ, పన్నుల బదలాయింపుల్లో హేతుబద్దత, ఇన్‌స్పెక్టర్ రాజ్‌కు ముగింపు, పన్నుల మీద పన్నులు వంటి సమస్యల పరిష్కారం దిశగా ఈ కొత్త వ్యవస్థను కేంద్రం తీసుకువస్తోంది. 1947 తరువాత దేశంలో ఇంత భారీ స్థాయిలో పన్ను వ్యవస్థలో మార్పు ఇదే తొలిసారి. ఈ తాజా పన్నుల వ్యవస్థ అమలు వల్ల భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఒకటి నుంచి రెండు శాతం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement