లాభాలతో వీడ్కోలు
కొనుగోళ్ల జోరు
► 260 పాయింట్ల లాభంతో 26,626కు సెన్సెక్స్
► 82 పాయింట్ల లాభంతో 8,186కు నిఫ్టీ
స్టాక్ మార్కెట్ ఈ ఏడాదికి లాభాలతో వీడ్కో లు పలికింది. ఈ ఏడాది చివరిరోజైన శుక్రవారం రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడి 26,626 పాయింట్ల వద్ద, ఎన్ ఎస్‌ఈ నిఫ్టీ 82 పాయింట్లు లాభపడి 8,186 పాయింట్ల వద్ద ముగిశా యి. ఇది బీఎస్‌ఈకి రెండు వారాల తాజా గరిష్ట స్థాయి. 2017, జనవరి సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్ లాభాలతో శుభారంభం చేసింది. ఎఫ్‌ఎంసీజీ, విద్యుత్తు, ఫార్మా షేర్లు లాభపడ్డాయి.
జోరుగా కొనుగోళ్లు..
రద్దు చేసిన పెద్ద కరెన్సీ నోట్లను డిపాజిట్ చేయడానికి శుక్రవారమే చివరి రోజు కావడం, రానున్న బడ్జెట్‌లో వృద్ధికి ఊపునిచ్చే చర్యలను ప్రభుత్వం తీసుకోగలదన్న ఆశావహ అంచనాలతో ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోతుందన్న ఆందోళనల నేపథ్యంలో పన్ను వసూళ్లు పెరిగాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడంతో సెంటిమెంట్ మెరుగుపడింది. ఆసియా మార్కెట్లు లాభపడడం, రూపాయి బలపడడం, చిన్న వ్యాపార సంస్థల చర మూలధన రుణ నిబంధనలను ఆర్‌బీఐ సరళీకరించడం సానుకూలప్రభావం చూపాయి.
పన్ను రాయితీలపై ఆశలు..
ప్రధాని నరేంద్ర మోదీ నేటి(శనివారం)ఉపన్యాసంలో ఆశావహ అంశాలుంటాయనే అంచనాలు స్టాక్ మార్కెట్లో నెలకొన్నాయని జియోజిత్ బీఎన్ పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. బడ్జెట్‌లో పన్ను రాయితీలుంటాయనే అంచనాలు, డాలర్ బలహీనపడడం, పన్ను వసూళ్లు జోరుగా ఉండడం సెంటిమెంట్‌కు ఊపునిచ్చాయని వివరించారు. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ 300 పాయింట్లు లాభపడినప్పటికీ, ఈ ఏడాది చివరికల్లా కీలకమైన 8,200 పాయింట్లను దాటలేకపోయింది.
పంచదార షేర్లకు లాభాల తీపి: పంచదార మిల్లుల రుణ పునర్వ్యస్థీకరణ ప్రతిపాదన ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందన్న వార్తల కారణంగా పంచదార షేర్లకు లాభాలు వచ్చాయి. అప్పర్ గంగేస్, ఉత్తమ్ షుగర్ మిల్స్, ఔధ్ షుగర్, ద్వారికేశ్ షుగర్స్, ధమ్‌పూర్ షుగర్ షేర్లు 4–13% రేంజ్‌లో లాభపడ్డాయి.
4 సెన్సెక్స్ షేర్లకే నష్టాలు..
30 సెన్సెక్స్ షేర్లలో 4 షేర్లకే (ఓఎన్ జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా స్టీల్, బజాజ్ ఆటో) నష్టాలు వచ్చాయి. 26 షేర్లు లాభపడ్డాయి.
స్టాక్ మార్కెట్ డేటా
టర్నోవర్ (రూ. కోట్లలో)
బీఎస్‌ఈ 3,136
ఎన్‌ఎస్‌ఈ (ఈక్విటీ విభాగం) 14,902
ఎన్‌ఎస్‌ఈ (డెరివేటివ్స్) 2,04,807
ఎఫ్‌ఐఐ –586
డీఐఐ 725