నోటీసులొస్తున్నాయా? భయం వద్దు!!
♦ రుజువులను సిద్ధం చేసుకోండి
♦ సమాధానమివ్వండి
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి గతవారం అన్ని పత్రికల్లో సంచలనమైన వార్త ‘నోటీసులొస్తున్నాయి’ అనేది. అదేనండి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వారు ‘మా దగ్గర 14 లక్షల మంది జాతకాలు ఉన్నాయి. ఇందులో 7 లక్షల మంది పాన్ వేయకుండా పెద్ద పెద్ద వ్యవహారాలు జరుపుతున్నారు. వీరందరికి త్వరలో నోటీసులు జారీచేస్తాం’. అని హెచ్చరించారు కదా.. ఆ వార్త!!. ఆదాయ పన్ను శాఖ గతంలోనైతే లక్షలు ఖర్చుపెట్టి అన్ని భాషల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేది. ఇందులో జాగ్రత్తగా ఉం డండి. మీకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం మా వద్ద ఉంది. మీ పని పడతాం. అని హెచ్చరించేది. సరే వారి విధివిధానాలు ఎలా ఉన్నా.. మనం చట్టం ప్రకారం నడవాలి. మన బాధ్యతలు నిర్వర్తించాలి.
⇔ ప్రతి సంవత్సరం ఆ ఆర్థిక సంవత్సరంలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి వార్షిక సమాచార రిటర్న్ దాఖలు చేయాలి. ఆ అంశాలు ఏమంటే..
⇔ ఒక బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ మొత్తం రూ.10,00,000 ఉన్నా..
⇔ ఒక క్రెడిట్ కార్డు మీద చెల్లింపులు రూ.2,00,000 దాటినా..
⇔ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఆదాయం రూ.2,00,000 మించినా..
⇔ రూ.5,00,000 దాటి డిబెంచర్స్/షేర్లు కొన్నా..
⇔ స్థిరాస్తి విక్రయాలు రూ.30,00,000 దాటినా..
పైన చెప్పినవన్నీ పెద్ద పెద్ద ఆర్థిక వ్యవహారాలు. వీటిని ఆయా సంస్థలు ఆదాయ పన్ను శాఖకు రిటర్న్ ద్వారా తెలియజేయాలి. ఆదాయపన్ను శాఖ అలా తెలిపిన సమాచారాన్ని విశదీకరించి, క్రోడికరించి భద్రపరిచింది. కొన్ని లక్షల వ్యవహారాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఆ సమాచారాన్ని విడతల వారీగా విడుదల చేస్తున్నారు. అంటే ఆ వ్యక్తిని నోటీసుల ద్వారా అడుగుతారు.
ఉదాహరణకు ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో మొత్తంగా డిపాజిట్లు రూ.10,00,000 దాటిన విషయాన్ని పరిశీలిద్దాం. సౌభాగ్యవతికి సేవింగ్స్ ఖాతా ఉందనుకోండి. ఖాతాలో 01.04.2013 నాటి నిల్వ రూ.2,000. తర్వాత అందులో పలు దఫాలుగా మొత్తంగా రూ.10,00,000 జమ అయ్యిందనుకోండి. పాన్ ఉంటే చాలా మంచిది.డ్రైవింగ్ లెసైన్స్ ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ చేయడం వేరు. లెసైన్స్ లేని వ్యక్తి యాక్సిడెంట్ చేయడం వేరు. ఇప్పుడు డిపార్ట్‌మెంట్ వారు నోటీసులు ఇస్తారు. మీరు మీ అకౌంట్‌ను చెక్ చేసుకోండి. నోటీసుల్లోని సమాచారం నిజమా? కాదా? అని తెలుసుకోండి.
నిజమైతే నిదానంగా సమాధానమివ్వండి. అది న గదు డిపాజిట్టా? చెక్ డిపాజిట్టా? చూడండి. నగదు అయితే ఎలా వచ్చిందో గుర్తుకు తెచ్చుకోండి. వేరొక అకౌంట్ నుంచి ఈ ఖాతాలోకి వేసి ఉండొచ్చు. అదే చెక్ అయితే.. ఎవరిచ్చారో చూడండి. ప్రతి డిపాజిట్ ఆదాయం కాదు. మీకు ఎవరైనా అప్పు ఇవ్వొచ్చు. లేదా జీతం కావొచ్చు. ఏదేని అమ్మకం ద్వారా రావొచ్చు. బీమా మొత్తం కావొచ్చు. వివరణ ఇచ్చేందుకు అన్ని విషయాలను గుర్తుకు తెచ్చుకోండి. కాగితాలు/రుజువులు సంపాదించండి.
బెదరనవసరం లేదు. నిజం చెప్పండి. అమెరికా నుంచి మీ అబ్బాయి ఇచ్చి ఉండొచ్చు. ఇక్కడ వివరణ తప్పయినా.. అధికారుల సంతృప్తి మేరకు కాగితాలు చూపించకపోయినా.. ‘ఈ డిపాజిట్ల మొత్తం’ మీరు ప్రకటించని ఆదాయం (అన్‌డిస్ల్కోజ్‌డ్ ఇన్‌కమ్) అవుతుంది. ఇటువంటివి బయటకు తీయడమే తాజా నోటీసుల జారీ ప్రకటన వెనకున్న అసలు ఉద్దేశం. నోటీసులకు సమాధానమివ్వండి. అవసరమైతే వృత్తి నిపుణుల సహాయం తీసుకోండి.