భువనేశ్వర్: అమెరికా నుంచి ముడి చమురుతో బయలుదేరిన తొలి ఓడ ఒడిశా లోని పారదీప్ ఓడరేవుకు సోమవారం చేరింది. అతి పెద్ద ముడి చమురు రవాణా ఓడ ‘వీఎల్‌సీసీ ఎమ్‌టీ న్యూ ప్రాస్పెరిటీ’ ద్వారా 1.6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు అందినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) తెలిపింది. మరో 3.95 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు కోసం యూఎస్‌ను కోరినట్లు ప్రకటించింది.
భారత్–యూఎస్ వాణిజ్య సంబంధాల్లో ప్రధానంగా చమురు–గ్యాస్ రంగాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. హైడ్రోకార్బన్ రంగాన్ని పటిష్టపరిచేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ నెలలో జరిపిన అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. 1975లో అమెరికా చమురు ఎగుమతులను నిలిపివేసింది. దాదాపు 42 ఏళ్ల తర్వాత మళ్లీ ఎగుమతులు ప్రారంభించింది. ఇలా సుదీర్ఘ విరామం అనంతరం అమెరికా నుంచి తొలిసారిగా చమురు దిగుమతులు చేసుకుంటున్న దేశాల్లో ఒకటిగా భారత్ కూడా నిల్చింది.