జారిపోతున్న మైక్రోమ్యాక్స్..! | Micromax's Canvas 6 Pro will start shipping from April 20 | Sakshi
Sakshi News home page

జారిపోతున్న మైక్రోమ్యాక్స్..!

Published Wed, Apr 20 2016 8:18 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

జారిపోతున్న మైక్రోమ్యాక్స్..!

జారిపోతున్న మైక్రోమ్యాక్స్..!

ఏడాదిలో 8% తగ్గిన మార్కెట్ వాటా
* 22 శాతం నుంచి 14.1 శాతానికి తగ్గిన తీరు
* తగ్గిన నాణ్యత, రిపేర్ల కోసం కస్టమర్ల క్యూ
* విక్రయానంతర సేవలు తగ్గటంతో అసంతృప్తి
* తక్కువ ధర ఫోన్లతో చైనా కంపెనీల పోటీ
* వేగంగా పట్టు పెంచుకుంటున్న డ్రాగన్


మైక్రోమ్యాక్స్!!. పేరుకు తగ్గట్టే మ్యాక్స్ స్థాయి నుంచి మైక్రోకు జారిపోతోందా? పరిస్థితులు చూస్తుంటేఅవుననే సమాధానమే వస్తోంది. 2014లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఏకంగా 22 శాతం వాటాతో నెంబర్-1కు కాస్తంత దూరంలో నిలిచిన ఈ సంస్థ... జస్ట్ ఏడాదిలో ఏకంగా 8 శాతం వాటాను కోల్పోయింది. 2015 డిసెంబరు క్వార్టర్‌లో దీని వాటా కేవలం 14.1 శాతానికి పరిమితమైందని ఐడీసీ చెబుతోంది. ఒకవైపు దేశీ మొబైల్ మార్కెట్ బాగా వృద్ధి చెందుతున్నా... మైక్రోమ్యాక్స్ కూడా విపరీతంగా మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నా... అవేవీ కస్టమర్లను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఆ వైఫల్యం అంకెల్లో కనిపిస్తోంది కూడా!!.
 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత మొబైల్ మార్కెట్ వృద్ధి మామూలుగా లేదు. 2015లో స్మార్ట్‌ఫోన్స్ విపణి ఏకంగా 29% వృద్ధి చెంది 10.3 కోట్ల యూనిట్లు నమోదు చేసింది. స్మార్ట్‌ఫోన్ విప్లవంతో ఈ వృద్ధి మరికొన్నేళ్లు అంతకంతకూ పెరుగుతుందనే అంచనాలున్నాయి. చైనా కంపెనీలు దీన్ని అందిపుచ్చుకోవాలనుకున్నాయి. దీంతో ఒకప్పుడు దేశీ కంపెనీలకు... అవి చెప్పినట్లుగా ఫోన్లు తయారు చేసి ఇచ్చిన చైనా సంస్థలు... నేరుగా భారత మార్కెట్లోకి తమ సొంత  బ్రాండ్లతో వచ్చేశాయి.

యాపిల్‌తో సహా వివిధ దిగ్గజ బ్రాండ్లకు తయారీ సంస్థగా ఉన్న ఫాక్స్‌కాన్‌తో పాటు.. షావొమీ, జియోనీ, కూల్‌ప్యాడ్, ఓపో తదితర ప్రముఖ సంస్థలు వరుస కట్టాయి. అలాగే వన్‌ప్లస్, వివో, లెనోవో, ప్యానాసోనిక్, మోటరోలా వీటికి తోడయ్యాయి. ఫలితం.. గడచిన ఏడాదిలో చైనా కంపెనీల వాటా ఏకంగా 12 నుంచి 22 శాతానికి చేరినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) వెల్లడించింది. అంతేకాదు! 2015లో బ్రాండింగ్‌కు, ప్రకటనలకే చైనా కంపెనీలు రూ.1,200 కోట్ల దాకా వెచ్చించాయి. వీటిలో వివో, ఓపో, జియోనీ, ఎల్‌ఈ ఎకో 55% ఖర్చు చేశాయి. వివో ఏకంగా ఐపీఎల్‌కే ప్రధాన స్పాన్సర్‌గా మారింది. దేశీ బ్రాండ్లయిన సెల్‌కాన్, కార్బన్, వీడియోకాన్, లావా, ఇంటెక్స్ కూడా మెల్లగా తమ వాటా పెంచుకుంటూ పోతున్నాయి. ఈ పరిణామాలన్నీ మైక్రోమ్యాక్స్‌ను తిరోగమన బాట పట్టేలా చేశాయి.
 
సర్వీసింగ్‌లో విఫలం..!
ఒకప్పుడు మైక్రోమ్యాక్స్ బలం దాని విక్రయానంతర సేవలే. ఇపుడు అవి సరిగా లేకపోవటమే దాని బలహీనతగా మారింది. ఈ మధ్య కాలంలో కంపెనీ భారీగా మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. వీటిలో నాణ్యత కొరవడిందన్న ఆరోపణలూ  ఉన్నాయి. ‘‘ఏ కంపెనీకైనా విక్రయానంతర సేవలే బలం. వాటిలో మైక్రోమ్యాక్స్ విఫలమైంది’’ అని మొబైల్స్ విక్రయ సంస్థ టెక్నోవిజన్ ఎండీ సికందర్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోతో చెప్పారు.

ఒకప్పుడు అంతర్జాతీయ బ్రాండ్ల ధరతో పోలిస్తే సగం ధరకే మోడళ్లను కంపెనీ తెచ్చిందని, తక్కువ ధరకే అధిక ఫీచర్లున్న ఫోన్లు వస్తున్నాయి కదా అని కస్టమర్లు కొన్నారని ఆయన చెప్పారు. ‘‘నాణ్యత లేదు. సర్వీసింగ్ కేంద్రాల్లో కస్టమర్లు క్యూ కడుతున్నారు. మొబైల్‌లో చిన్న సమస్య వచ్చినా, పరిష్కారానికి రోజుల కొద్దీ వేచి చూడాల్సి వస్తోంది. అమ్మకాలపై చూపిన శ్రద్ధను సర్వీసింగ్‌పై కంపెనీ చూపడం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
 
పెద్ద కంపెనీల ధరల మంత్రం..
నిజానికి మైక్రోమ్యాక్స్ వంటి కంపెనీల విజయ రహస్యం ధరలే. కానీ ఇపుడు శామ్‌సంగ్‌తో పాటు చైనా కంపెనీలన్నీ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. శామ్‌సంగ్ ఇటీవల తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లను తీసుకురాగా... ఇన్‌ఫోకస్ బ్రాండ్‌తో ఫాక్స్‌కాన్ కూడా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. చైనా బ్రాండ్లన్నీ అధిక ఫీచర్లతో అందుబాటు ధరలో మోడళ్లను తెస్తుండటంతో ఆ ప్రభావం మైక్రోమ్యాక్స్‌కే గట్టిగా తగిలింది. మున్ముందు ఈ కంపెనీకి తీవ్ర పోటీ తప్పదని కౌంటర్‌పాయింట్ రిసర్చ్ అనలిస్ట్ తరుణ్ పాఠక్ చెప్పారు. 2015 చివరి త్రైమాసికంలో మొబైల్ పరిశ్రమ 15.4% పెరగ్గా మైక్రోమ్యాక్స్ విక్రయాలు 12% తగ్గాయని ఐడీసీ వెల్లడించింది. డిసెంబర్ క్వార్టర్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దేశంలో శామ్‌సంగ్‌కు 26.8%, మైక్రోమ్యాక్స్ 14.1, లెనోవో గ్రూప్ 11.6, ఇంటెక్స్ 9.4, లావా 7, ఇతర కంపెనీలు 31.1% వాటా ఉంది.
వాటా కొనలేదు... ఐపీఓ రాలేదు
ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా... మైక్రోమ్యాక్స్‌లో 20 శాతం వాటా కొనుగోలు చేయాలని భావించినా ఒప్పందం బెడిసి కొట్టింది. జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ నుంచి రుణం పొందే ప్రయత్నాలు కూడా విజయవంతం కాలేదు. అంతెందుకు! పబ్లిక్ ఇష్యూకు రావటానికి ఈ సంస్థ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. గతంలో ఓ సారి మైక్రోమాక్స్ సంస్థ సెబీకి ప్రాస్టెక్టస్ కూడా దాఖలు చేసింది. కానీ ఐపీఓ ఆగిపోయింది. వీటన్నిటికీ తోడు సంస్థలో కీలక వ్యక్తులుగా ఉన్న సీఈవో వినీత్ తనేజా, చైర్మన్ సంజయ్ కపూర్‌లు దూరం కావడమూ గట్టిదెబ్బే. కంపెనీకి, సంజయ్‌కి మధ్య నడుస్తున్న వివాదం బాగా ముదురుతోంది. తనను చట్ట విరుద్ధంగా తొలగించారని చెబుతున్న సంజయ్... అందుకు రూ.600-700 కోట్లు పరిహారం చెల్లించాలంటూ మైక్రోమ్యాక్స్‌పై దావా వేసే అవకాశం కనిపిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement