నిధుల సమీకరణకు సన్నాహాలు | Planning to raise funds | Sakshi
Sakshi News home page

నిధుల సమీకరణకు సన్నాహాలు

Published Tue, Jun 3 2014 12:41 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

నిధుల సమీకరణకు సన్నాహాలు - Sakshi

నిధుల సమీకరణకు సన్నాహాలు

 మోడీ సర్కారు రాకతో మెరుగుపడిన సెంటిమెంట్
 
 న్యూఢిల్లీ: మార్కెట్ల జోరు కొనసాగుతుండడంతో షేర్లు, సెక్యూరిటీల జారీ ద్వారా నిధులు సమీకరించేందుకు పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. దాదాపు రూ.15 వేల కోట్ల సమీకరణ యోచనలో ఉన్నట్లు గత పక్షంలో కనీసం ఐదు కంపెనీలు ప్రకటించాయి. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం, ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతల స్వీకరణతో మార్కెట్ సెంటిమెంట్ బలోపేతమైంది. నిధుల సమీకరణ యోచనలు అప్పటినుంచే రూపుదిద్దుకోవడం మొదలైంది.
 
 మార్కెట్ నుంచి నిధులు సమీకరించే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించిన కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జైప్రకాశ్ పవర్ వెంచర్స్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీఎఫ్ యుటిలిటీస్, ఆమ్‌టెక్ ఆటో ఉన్నాయి. యునెటైడ్ బ్యాంక్‌ను మినహాయిస్తే మిగిలిన కంపెనీలు నిధుల సమీకరణకు బోర్డు అనుమతులు పొందాయి. ఇంకా అనేక కంపెనీలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లతోనూ, అంతర్గత బృందాలతోనూ నిధుల సమీకరణపై చర్చిస్తున్నాయి.
 
 సెకండరీ మార్కెట్లలో లావాదేవీలు ఇటీవల భారీగా పుంజుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇటీవలి వారాల్లో కొత్త శిఖరాలకు చేరుతోంది. ఆర్థిక సంస్కరణలకు మోడీ సర్కార్ శ్రీకారం చుట్టగానే ఇన్వెస్టర్ సెంటిమెంట్ మరింత మెరుగుపడుతుందని అంచనా.
 
 దేశీయ మార్కెట్‌తో పాటు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి కూడా నిధుల సమీకరణకు కంపెనీలు యోచిస్తున్నాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్స్ (క్విప్), విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ), ఫారిన్ కరెన్సీ కన్వర్టిబుల్ బాండ్స్ (ఎఫ్‌సీసీబీ), అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్), ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) తదితర పద్ధతుల్లో నిధులు సమీకరించాలని ఆలోచిస్తున్నాయి.
 
 అంతా అనుకూలం
 నిధుల సమీకరణకు అనుకూలమైన వాతావరణం నెలకొంది. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త గరిష్టాలకు చేరుతున్నాయి. సంస్థాగత ఇన్వెస్టర్లలో మళ్లీ విశ్వాసం నెలకొంది. ఈక్విటీ మార్కెట్, ఇతర సాధనాల ద్వారా నిధుల సమీకరణకు ఇదే తగిన సమయం.
 - అలెక్స్ మాథ్యూ, ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్, జియోజిత్ బీఎన్‌పీ పారిబా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement