శనివారం షాంఘైలో జరిగిన ఇండియా-చైనా బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ
భారత్ చైనా మధ్య డీల్స్ ఖరారు
⇒ చారిత్రక అవకాశాలు అందుకోండి
⇒ చైనా ఇన్వెస్టర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
షాంఘై: ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య భారీ ఒప్పందాలు కుదిరాయి. 22 బిలియన్ డాలర్ల విలువ చేసే 26 డీల్స్‌ను భారత్, చైనా కంపెనీలు శనివారం కుదుర్చుకున్నాయి. విద్యుత్, ఉక్కు, చిన్న..మధ్య తరహా పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు తదితర రంగాల కంపెనీల డీల్స్ ఇందులో ఉన్నాయి.
భారత్-చైనా బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్న సందర్భంగా భారత్‌లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది చారిత్రక తరుణమని ప్రధాని నరేంద్ర మోదీ ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య వ్యాపార బంధాలు మళ్లీ మెరుగుపడేందుకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఇటీవలి భారత పర్యటన దోహదపడిందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ భాగస్వామ్యం మరింత పటిష్టం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది జిన్‌పింగ్ పర్యటనలో భాగంగా చైనా 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు కుదిరాయని ప్రధాని గుర్తు చేశారు.
చైనా పటిష్టంగా ఉన్న రంగాల్లో భారత్ కూడా ఎదిగేందుకు తోడ్పాటునివ్వగలదని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘మీరు ప్రపంచపు ఫ్యాక్టరీగా పేరొందారు. మేము ప్రపంచానికి బ్యాక్ ఆఫీస్‌గా పేరొందాం. హార్డ్‌వేర్ మీ బలం అయితే.. సాఫ్ట్‌వేర్, సర్వీసులు మా బలం’ అని మోదీ పేర్కొన్నారు. భారత్‌లో వ్యాపార పరిస్థితులను మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ చెప్పారు. రెండు దేశాల పరిశ్రమల దిగ్గజాలు బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. హువాయ్, అలీబాబా, షాంఘై అర్బన్ కన్‌స్ట్రక్షన్ తదితర సంస్థల అధిపతులు ఇందులో ఉన్నారు.
అదానీ, భారతీ గ్రూప్ హవా..
రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల్లో సింహభాగం .. అదానీ, భారతీ గ్రూప్‌వే ఉన్నాయి. విద్యుత్, పోర్టులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి తదితర రంగాలకు సంబంధించి అదానీ గ్రూప్ డీల్స్ కుదుర్చుకుంది. ఇక, భారతీ గ్రూప్ కార్యకలాపాల విస్తరణ కోసం రెండు చైనా బ్యాంకులు 2.5 బిలియన్ డాలర్లు సమకూర్చేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇవి కాకుండా సౌర విద్యుత్ రంగంలో వెల్‌స్పన్ గ్రూప్ రెండు ఒప్పందాలు.. ఎస్సెల్ గ్రూప్, సన్ గ్రూప్, యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్, ఇన్ఫోసిస్, విప్రో, జీఎంఆర్, ఎన్‌ఐఐటీ, ఆర్వీ అసోసియేట్స్ మొదలైనవి తలో ఒప్పందం కుదుర్చుకున్నాయి.