వడ్డీరేట్లను తగ్గించిన చైనా బ్యాంక్
- 12 నెలల్లో ఆరు సార్లు కోత
బీజింగ్: ఆర్థిక వ్యవస్థకు ఊపునివ్వడానికి చైనా కేంద్ర బ్యాంక్ బెంచ్‌మార్క్ వడ్డీరేట్లను తగ్గించింది. రుణ, డిపాజిట్ వడ్డీరేట్లను చెరో పావు శాతం తగ్గిస్తున్నట్లు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పేర్కొంది. బ్యాంకులు తమ వద్ద ఉంచుకునే నగదుకు సంబంధించి రిజర్వ్ రిక్వైర్‌మెంట్ రేషియో(ఆర్‌ఆర్‌ఆర్)ను అర శాతం తగ్గించింది. దీనివల్ల బ్యాంకులకు పుష్కలంగా నిధులు అందుబాటులోకి వస్తాయని, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని చైనా కేంద్ర బ్యాంక్ భావిస్తోంది. చైనా కేంద్ర బ్యాంక్ గత నవంబర్ నుంచి ఇప్పటిదాకా ఆరుసార్లు వడ్డీరేట్లను తగ్గించింది.