ఆశలు ఆవిరయ్యే.. !
రైల్వే బడ్జెట్ నిరాశపరచడం, ఆశావహంగా లేని ఆర్థిక సర్వేలతో నరేంద్ర మోడి ప్రభుత్వపు తొలి బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల ఆశలు ఆవిరయ్యాయి. వీటికి అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల బలహీనత జత కావడంతో స్టాక్ మార్కెట్లు బుధవారం క్షీణించాయి. 25,684-25,365 రేంజ్‌లో కదలాడిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 137 పాయింట్లు(0.54 శాతం) క్షీణించి 25,445 పాయింట్ల వద్ద. నిఫ్టీ 38 పాయింట్లు క్షీణించి 7,585 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు జూన్ 30 తర్వాత ఇదే కనిష్టస్థాయి. నిఫ్టీకి ఇది వారం కనిష్ట స్థాయి.
ద్రవ్య పరిస్థితి అంచనా వేసిన దానికంటే అధ్వానంగా ఉందని ఆర్థిక సర్వే వెల్లడించడంతో స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ పడిపోయాయి. ఆర్థిక సర్వే ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నివ్వలేకపోయింది. బడ్జెట్‌కు ముందు విదేశీ, స్వదేశీ ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించడంతో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. రైల్వే బడ్జెట్ నిరాశపరచడంతో నేటి సాధారణ బడ్జెట్ కూడా అలాగే ఉంటుందన్న అంచనాలు స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. వాహన, విద్యుత్, రియల్టీ, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్, ఐటీ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మరోవైపు రిఫైనరీ, కన్సూమర్ డ్యురబుల్, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ట్రేడింగ్ చివరలో చాలా మంది ట్రేడర్లు లాంగ్ పొజిషన్లను తగ్గించుకునే ప్రయత్నాలు చేయడంతో నిఫ్టీ 38 పాయింట్లు పడిపోయింది.
చమురు షేర్ల వెలుగులు
టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌లు 1-2 శాతం నష్టపోయాయి. వర్షాలు సరిగ్గా కురవకపోవడం వాహన షేర్లపై ప్రభావం చూపింది. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, మారుతీ సుజుకి, టాటా మోటార్స్ 2-4 శాతం రేంజ్‌లో క్షీణించాయి. ఎన్‌టీపీసీ, టాటా పవర్ షేర్లు 2-3 శాతం రేంజ్‌లో పడిపోయాయి. మంగళవారం దూసుకుపోయిన సన్‌ఫార్మా కంపెనీ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా బుధవారం 1.4 శాతం క్షీణించింది. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు 1 శాతం చొప్పున పడిపోయాయి.
ఇక ఎల్ అండ్ టీ, కోల్ ఇండియా, భెల్ కంపెనీల షేర్లు 0.5-3.5 శాతం రేంజ్‌లో పడిపోయాయి. బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌షేర్లు తగ్గాయి. రైల్వే సంబంధిత షేర్ల పతనం బుధవారం కూడా కొనసాగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ, గెయిల్‌లు 0.5-1.6 శాతం పెరిగాయి. సంక్షేమ పథకాలను పునర్వ్యస్థీకరణ జరగాలని ఆర్థిక సర్వే వెల్లడించడంతో ఎఫ్‌ఎంసీజీ షేర్లు, ఐటీసీ 2 శాతం, హిందూస్తాన్ యునిలివర్ 0.8 శాతం చొప్పున పెరిగాయి.మార్కెట్ బ్రెడ్త్ బలహీనంగా ఉంది. బీఎస్‌ఈలో 2,086 షేర్లు నష్టపోగా, 893 షేర్లు లాభపడ్డాయి. బీఎస్‌ఈలో రూ.3,827 కోట్ల టర్నోవర్ నమోదైంది.
చైనా ద్రవ్యోల్బణం, యూరప్ పారిశ్రామిక డేటా బలహీనంగా ఉండడం వంటి కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. వాల్యూయేషన్లు అధికంగా ఉన్నాయన్న అంచనాలతో ఆసియా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగియగా, యూరోప్ సూచీలు ప్రారంభంలో తక్కువ స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి.