మోడీ..... మేజిక్!
ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం, అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గిన చమురు ధరలు ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చాయి. వెరసి దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులను అందుకున్నాయి. సెన్సెక్స్ 288 పాయింట్లు ఎగసి 26,391కు చేరగా, నిఫ్టీ కూడా 83 పాయింట్లు జంప్‌చేసి 7,874 వద్ద ముగిసింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, ఇంట్రాడేలోనూ కొత్త చరిత్రను సృష్టిస్తూ సెన్సెక్స్ గరిష్టంగా 26,413ను తాకింది.
ఈ బాటలో నిఫ్టీ సైతం 7,880ను అధిగమించింది. మేక్ ఇండియా, మేడిన్ ఇండియా విజన్‌లో భాగంగా దేశాన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న మోడీ ప్రణాళికలు మార్కెట్లకు టానిక్‌లా పనిచేశాయి. సుపరిపాలన, అందరికీ అభివృద్ధిలో భాగం, ఇన్‌ఫ్రా రంగంపై ప్రత్యేక దృష్టి వంటి అంశాలు ఇందుకు అండగా నిలిచాయని విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు ముడిచమురు ధరలు మరింత చల్లబడటంతో సెంటిమెంట్ మరింత బలపడిందని తెలిపారు. ఫలితంగా వరుసగా ఐదో రోజు మార్కెట్లు లాభపడ్డాయి. ఐదు రోజుల్లో సెన్సెక్స్ 1,062 పాయింట్లు జమ చేసుకోవడం విశేషం! సెన్సెక్స్ ఇంతక్రితం జూలై 25న 26,300 వద్ద, నిఫ్టీ 7,840 వద్ద ముగిసి కొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
ఐటీ, ఎఫ్‌ఎంసీజీ మినహా
బీఎస్‌ఈలో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆటో రంగాలు 2.6-1.6 శాతం మధ్య పుంజుకున్నాయి.
హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ జోరు
ఆయిల్ రంగ షేర్లలో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ 6.5-5.5% స్థాయిలో జంప్‌చేయగా, పెట్రోనెట్, ఐవోసీ, ఆయిల్ ఇండియా 4.5-3% మధ్య పెరిగాయి. ఆర్‌ఐఎల్ సైతం 1% లాభపడింది.
యాక్సిస్ బ్యాంక్ దూకుడు
బ్యాంకింగ్ షేర్లలో యాక్సిస్, ఫెడరల్, ఐసీఐసీఐ, యస్ బ్యాంక్, ఎస్‌బీఐ, కెనరా, బీవోఐ 4.5-2% మధ్య పురోగమించాయి. ఇక ఆటో షేర్లలో అపోలో టైర్స్, టాటా మోటార్స్, ఎంఆర్‌ఎఫ్, కమిన్స్, మారుతీ 4.5-1.5% మధ్య బలపడ్డాయి.
ఏఐఏ ఇంజనీరింగ్ 6% అప్
క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్‌లో ఏఐఏ ఇంజనీరింగ్, పిపావవ్, పుంజ్‌లాయిండ్, సుజ్లాన్, బీహెచ్‌ఈఎల్, క్రాంప్టన్ గ్రీవ్స్, ఆల్‌స్తోమ్ టీఅండ్‌డీ, ఎల్‌అండ్‌టీ 6-2% మధ్య జంప్‌చేశాయి.
దిగ్గజాల వెనకడుగు: సెన్సెక్స్ దిగ్గజాలలో సిప్లా 5%, భారతీ 3% చొప్పున లాభపడగా.. ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ 1.7-1% మధ్య డీలాపడ్డాయి.
చిన్న షేర్లలో లాభపడ్డవే అధికం
సెంటిమెంట్‌కు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 2% స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,930 లాభపడగా, 1,003 నష్టపోయాయి.
వెలుగులో డీవీఆర్ షేర్లు: బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌లలో డీవీఆర్‌లకు చోటుకల్పిస్తారన్న వార్తలతో టాటా మోటార్స్ డీవీఆర్ 6% ఎగసింది. ఫ్యూచర్ రిటైల్ 5.4%, గుజరాత్ ఎన్‌ఆర్‌ఈ 5%, జైన్ ఇరిగేషన్ డీవీఆర్ 5% చొప్పున పెరిగాయి. క్యూ1లో ప్రోత్సాహక ఫలితాలతో వర్ల్‌పూల్ 10% దూసుకెళ్లింది.
ఎఫ్‌ఐఐల జోరు...
గత వారం రూ. 2,144 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 473 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మరోపక్క దేశీయ ఫండ్స్ కూడా రూ. 490 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.