మళ్లీ తగ్గుతున్న వెండి ధరలు
ముంబయి : నిన్న మొన్నటి వరకూ పైపైకి చేరిన వెండి ధర మళ్లీ తగ్గుతోంది. గతంలో ఒకసారి 40 వేల దిగువకు వచ్చి మళ్లీ వేగంగా 50 వేలకు వెళ్లింది. ఇప్పుడు మళ్లీ 50 వేల నుంచి కిందకు వస్తోంది. క్రమంగా 45 వేల వైపు వస్తోంది. గత రాత్రి ఎంసీక్స్లో కేజీ వెండి ధర 1,406 రూపాయలు పడి 45,335 రూపాయల వద్ద ముగిసింది. వెండిని ఎక్కువగా పారిశ్రామిక అవసరాల కోసం వాడుతుంటారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా వెండితో పాటు విలువైన లోహాలకు డిమాండ్ తగ్గుతోంది.
ఔన్స్ వెండి ధర 21 డాలర్లు దిగి 20 డాలర్ల దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మన దేశంలో కూడా ధర తగ్గుతోంది. వెండి ధర బాగా తగ్గినప్పటికీ బంగారం ధర మాత్రం ఆ స్థాయిలో తగ్గలేదు. గత రాత్రి ఎంసీక్స్లో 10 గ్రాముల బంగారం ధర 281 రూపాయలు నష్టపోయి 30,051 రూపాయల వద్ద ముగిసింది. ఔన్స్ బంగారం ధర 14 డాలర్లు 1273 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ తక్షణం వెండి, బంగారం ధరలు పడటానికి కారణమయింది.