మార్కెట్‌లోకి టాటా ‘టిగోర్’ ఎంట్రీ..
ప్రారంభ ధర రూ.4.7 లక్షలు
ముంబై: దిగ్గజ వాహన తయారీ కంపెనీ ‘టాటా మోటార్స్’ తాజాగా తన కొత్త కాంపాక్ట్ సెడాన్ కారు ‘టిగోర్’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.4.7 లక్షలుగా ఉంది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యంకానుంది. 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ నాలుగు వెర్షన్లలో కస్టమర్లకు చేరువకానుంది. వీటి ధర రూ.4.7 లక్షలు–రూ.6.19 లక్షల శ్రేణిలో ఉంది. ఇక 1.05 లీటర్ డీజిల్ వేరియంట్‌లో కూడా నాలుగు వెర్షన్లే ఉన్నాయి. వీటి ధర రూ.5.6 లక్షలు–7.09 లక్షల శ్రేణిలో ఉంది.
అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. తాజా టిగోర్ మోడల్ వల్ల తమ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో మరింత విస్తరించిందని, కొత్త కస్టమర్లను ఆకర్షిస్తామని, ప్యాసెంజర్ వాహన మార్కెట్‌లో తిరిగి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తామని టాటా మోటార్స్ ఎండీ, సీఈఓ గుంటెర్ బషెక్ ధీమా వ్యక్తంచేశారు. టాటా మోటార్స్ 2017లో ఆవిష్కరించిన రెండో కొత్త మోడల్ ‘టిగోర్’.
కంపెనీ దీనికన్నా ముందు జనవరిలో ‘హెక్సా’ అనే ఎస్‌యూవీని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. టాటా టిగోర్ ప్రధానంగా మారుతీ స్విఫ్ట్ డిజైర్‌కు గట్టి పోటీనిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక్కడ స్విఫ్ట్ డిజైర్ కన్నా టైగర్ ధర తక్కువగా ఉంది. కాగా సుప్రీంకోర్టు విధించిన బీఎస్–3 వాహనాల నిషేధంపై కంపెనీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.