మార్కెట్‌లోకి ఫోక్స్‌వ్యాగన్ ‘టిగువన్’
ధర శ్రేణి రూ.27.98 లక్షలు– రూ.31.38 లక్షలు
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కార్ల తయారీ కంపెనీ ‘ఫోక్స్‌వ్యాగన్’ తాజాగా తన ప్రీమియం ఎస్‌యూవీ ‘టిగువన్’ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.27.98 లక్షలు– రూ.31.38 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. కంపెనీ ఈ ఎస్‌యూవీలో 7 స్పీడ్ ఆటోమేటిక్ డీఎస్‌జీ గేర్‌బాక్స్‌తో కూడిన 2 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చింది. తమ గ్లోబల్ బెస్ట్ సెల్లర్ మోడల్ అయిన ‘టిగువన్’ను ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకువచ్చామని ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ (సేల్స్) ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ థియరీ లెస్పియాచ్క్ తెలిపారు.
సేఫ్టీ, లగ్జరీ, స్టైల్, పనితీరు వంటి ఫీచర్ల సమాహారంగా ఈ మోడల్‌ను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. ఎంక్యూబీ ప్లాట్‌ఫామ్ ఆధారిత 4మోషన్ ఇంటెలిజెంట్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కంపెనీ నుంచి భారత్‌లోకి వస్తున్న తొలి కారు ఇదని తెలిపారు. ‘టిగువన్’ ఎస్‌యూవీ దేశవ్యాప్తంగా ఉన్న ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్స్ వద్ద కంఫర్ట్‌లైన్, హైలైన్ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.