వాల్‌పోస్ట్.. మనోళ్ల సోషల్ మీడియా! | wall post.com CEO Bangar Reddy | Sakshi
Sakshi News home page

వాల్‌పోస్ట్.. మనోళ్ల సోషల్ మీడియా!

Published Sat, Nov 28 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM

వాల్‌పోస్ట్.. మనోళ్ల సోషల్ మీడియా!

వాల్‌పోస్ట్.. మనోళ్ల సోషల్ మీడియా!

* సరికొత్త ఫీచర్లు,పూర్తి సెక్యూరిటీతో హల్‌చల్
* వెబ్‌లో 4 లక్షల మంది యూజర్లు.. జనవరిలో మార్కెట్లోకి యాప్
* వాల్‌పోస్ట్ సీఈఓ బంగార్ రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్స్ అడ్డాగా మారిన హైదరాబాద్‌లో అంతర్జాతీయ కంపెనీలకు సైతం సవాల్ విసిరే స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి. మీరు చేయలేని.. మీరందించని సేవలను సైతం మీం అందిస్తామంటూ కవ్విస్తున్నాయి కూడా. అలాంటి స్టార్టప్ కంపెనీయే ఈ ‘వాల్‌పోస్ట్’!!
 
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఫేస్‌బుక్, ట్వీటర్. కానీ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాల్‌పోస్ట్.కామ్ గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి. నిజానికి ఫేస్‌బుక్, ట్వీటర్‌లో సైతం లేని అధునాతనమైన ఫీచర్లు ఉన్నాయిందులో. ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో ఇది తక్కువేమీ కాదు.

సామాజిక మాధ్యమాలంటే ఫొటో షేరింగ్‌లు, లైకులు, కామెంట్లేనా అనే  ప్రశ్నే ఈ వాల్‌పోస్ట్ ఆరంభానికి మూలం. పదేళ్ల కిందట ఈ ప్రశ్న తలెత్తిన వెంటనే... దానికి సమాధానంగా ఈ ప్రయత్నాన్ని ఆరంభించారు బంగార్ రెడ్డి. దీనికి సంబంధించి ఆయనేమంటారంటే...
 
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సిస్టమ్స్ (ఎంసీఎస్‌ఈ) పూర్తి చేశాక.. ఆరు నెలల పాటు సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ (సీఈహెచ్) కోర్స్ చేశా. 2003 వరకు కూడా దేశంలో ఫేస్‌బుక్, ట్వీటర్ వంటివి లేవు. అప్పట్లో మైస్పేస్, ఆర్కుట్‌లదే రాజ్యం. వాటిలో కూడా చాలా తక్కువ ఫీచర్లుండేవి. టెక్నాలజీ మీద పట్టుండటంతో చాలా వెలితిగా అనిపించేది.

ఎవరో సోషల్ సైట్స్‌ను రూపొందిస్తే... మనం దాన్ని వాడటం, వాటికి ఆదాయాన్ని సంపాదించి పెట్టడమేంటని అనిపించేది. అప్పుడే... సొంతగా సోషల్ నెట్‌వర్క్‌ను రూపొందించాలని అనుకున్నా. అలా 2010 నవంబర్‌లో వాల్‌పోస్ట్.కామ్ వెబ్‌వెర్షన్ ఆరంభించా. అయితే దేశంలో స్మార్ట్‌పోన్లు, యాప్‌ల వినియోగం చూసి ప్రతి ఒక్కరినీ సులువుగా చేరుకోవాలంటే వాల్‌పోస్ట్ యాప్‌ను రూపొందించాలని నిర్ణయించుకున్నాం.

వచ్చే జనవరిలో వాల్‌పోస్ట్ యాప్‌నూ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాం కూడా. వాల్‌పోస్ట్‌లోని ప్రతి ఒక్క ఫీచర్‌లో పబ్లిక్, ప్రైవేట్ అనే రెండు అప్షన్స్ ఉంటాయి. మనకు అవసరమైనదాన్ని ఎంచుకునే వీలూ ఉంటుంది.
 
వాల్‌పోస్ట్‌లోని ముఖ్యమైన ఫీచర్లలో కొన్ని..
వాయిస్: ఇతర సోషల్ నెట్‌వర్కింగ్స్‌లో మన భావాలను, స్పందనలను అక్షర రూపంలోనే కామెంట్ చేయాలి. అన్ని సందర్భాల్లోనూ అక్షర రూపంలో కామెంట్ చేయలేం. అందుకే వాల్‌పోస్ట్‌లో మనం ఏం చెప్పదలచుకున్నామో దాన్ని మన సెల్‌ఫోన్ ముందు చెప్పేస్తే చాలు.. ఆటోమెటిక్‌గా ఆ వాయిస్ రికార్డ్ అయి వెంటనే అప్‌లోడ్ అయిపోతుంది.
 
ఈవెంట్స్: మనకు కావాల్సిన ప్రాంతం తాలూకు జిప్ కోడ్ (పిన్‌కోడ్) ఇస్తే చాలు. ఆరోజు ఆ ప్రాంతంలో జరిగే కార్యక్రమాల వివరాలొచ్చేస్తాయి. తాజా పోస్ట్‌లే కాదు.. గతంలో మనం చేసిన కామెంట్లు, పోస్ట్‌లు, ఫొటోలు తిరిగి పొందాలంటే డాష్‌బోర్డ్ ఆప్షన్‌లోకి వెళితే చాలు.
 
జాబ్స్: యూజర్ తన టెక్నికల్ స్కిల్స్‌ను జాబ్స్ ఆప్షన్‌లో అప్‌లోడ్ చేస్తే.. వారికి తగ్గ ఉద్యోగాలు ఏ కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయో ఆటోమెటిక్‌గా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.
 
నియర్ ప్రొఫెషనల్స్: ఒక కిలోమీటర్ పరిధిలో చుట్టూ ఉన్న వాల్‌పోస్ట్ యూజర్లు ఎవరు? వారి వృత్తి ఏంటి? అనే వివరాలు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అలాగే యాక్టివ్‌గా ఉన్న యూజర్ ఏ ప్రాంతంలో ఉన్నాడనే విషయం కూడా లోకేషన్ రూపంలో కనిపిస్తుంది.
 
ఎస్‌ఓఎస్: అత్యవసర సమయంలో వాల్‌పోస్ట్‌లోని ఎస్‌ఓఎస్ ఆప్షన్‌ను నొక్కితే చాలు. వాల్‌పోస్ట్ యూజర్లందరికీ అలర్ట్ వెళ్లిపోతుంది. దీంతో వాళ్లు స్పందించి మనల్ని రక్షించే అవకాశం ఉంది. ఇది మహిళలకు చాలా ఉపయుక్తం.
 
సోషల్ యాడ్స్: ఇతర సైట్స్‌లో ప్రకటన ఇవ్వాలంటే డబ్బు కట్టాలి. కాని వాల్‌పోస్ట్‌లో పూర్తి గా ఉచితం. అలాగే మన ప్రకటనను ఎవరైనా లైక్ చేస్తే అది వారి ఫ్రెండ్స్ లిస్ట్‌లో కూడా కనిపిస్తుంది. అంటే రొటేషన్ పద్ధతిలో అన్నమాట.
 గేమ్స్, అడ్రస్ బుక్, స్టోరీ రైటింగ్, పాస్‌వర్డ్ ప్రొటెక్టెడ్ ఆల్బమ్, ఫొటోట్యాగ్స్, ఆల్బమ్ ఇన్వైట్స్ హిస్టరీ, రీసెంట్ విజిటర్స్, అప్‌డేట్ ఎడిట్, రిపోర్ట్స్, సెర్చ్ అప్‌డేట్ వంటి ఎన్నో ఫీచర్లున్నాయిందులో.
 
ప్రభుత్వం సహకారం అందిస్తే...
‘‘దేశవ్యాప్తంగా ప్రస్తుతం వాల్‌పోస్ట్‌కు 4 లక్షల మంది యూజర్లున్నారు. ప్రభుత్వం మౌలికంగా, ఆర్థికంగా సహకారం అందిస్తే మరింత మెరుగైన సేవలనందిస్తాం. ఏడాదిలో 3-4 కోట్ల యూజర్లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 9 మంది టెక్నాలజీ సభ్యులున్నారు. ఇప్పటివరకు మా సంస్థలో సురేందర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, శశాంక్ తాటి ముగ్గురు పెట్టుబడిదారులు రూ.2 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టారు.
 
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement