అరెస్ట్ వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ, సీఐ
గుంటూరు,అవనిగడ్డ : దెయ్యం వదిలిస్తానని చెప్పి ఊపిరాడకుండా చేసి ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వి.పోతురాజు తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో డీఎస్పీ మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని తుంగలవారిపాలేనికి చెందిన తుంగల వెంకట సీతారామాంజనేయులు (38) స్నేహితుడు జూన్ 16వ తేదీ చెట్టుమీద నుంచి పడి మరణించాడు. అప్పటి నుంచి సీతారామాంజనేయులు పిచ్చిíపిచ్చిగా ప్రవర్తించసాగాడు. గాలి సోకిందనే అనుమానంతో కుటుంబ సభ్యులు తొలుత కోడూరు మండలం గుడుమోటులో ఇమామ్ దగ్గరకు తీసుకెళ్లాడు. అయినా మార్పు రాకపోవడంతో అవనిగడ్డలో ఇమామ్ ఉంటాడని, అతనైతే ఎలాంటి భూతాన్నయినా వదిలిస్తాడని చెప్పడంతో సీతారామాంజనేయులు తండ్రి తుంగల ప్రసాదరావు మహమ్మద్ నియాజ్ అహ్మద్ వద్దకు వెళ్లారు.
దెయ్యం వదిలించడానికి రూ.8 వేలు ఖర్చు అవుతుందని చెప్పాడు. ఈ మేరకు రూ.5 వేలు అడ్వాన్స్ చెల్లించడంతో ఈ నెల 27వ తేదీ నియాజ్ అహ్మద్ తుంగలవారిపాలెం వచ్చాడు. ప్రసాదరావు ఇంటి ముందు వరండాలో సీతారామాంజనేయులును కూర్చోబెట్టి బక్కెట్లలో నీళ్లు, మగ్, తెల్లటి టవల్ తీసుకురమ్మని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అనంతరం ముక్కు, నోరు కనబడకుండా తెల్లటి టవల్‌ను ఎడం చేత్తో ముఖానికి గట్టిగా కప్పేసి, కుడిచేత్తో మగ్గుతో నీళ్లు ముంచి ముఖానికి కొట్టసాగాడు. సీతారామాంజనేయులు విదిలించుకునే ప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఊపిరాడటం లేదని ఈ చర్యను వారించే ప్రయత్నం చేశారు. ఇలా అయితేనే దెయ్యం వదులుతుందని చెప్పిన నియాజ్ అహ్మద్ అదేపనిగా ముఖంపై నీళ్లు కొట్టడంతో చివరకు ఊపిరాడక సీతారామాంజనేయులు చనిపోయాడు. ఈ మేరకు మృతుని తండ్రి ప్రసాదరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ వి.పోతురాజు ఆధ్వర్యంలో సీఐ ఎస్‌వీవీఎస్ మూర్తి నేతృత్వంలో ఎస్‌ఐ మణికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మంగళవారం స్థానిక కోడూరు ఆటో స్టాండ్ వద్ద మహమ్మద్ నియాజ్ అహ్మద్‌ను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment