హేమలత (ఫైల్)
మెదక్ మున్సిపాలిటీ: ఓ వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన మెదక్ పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ భాస్కర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన మల్లేశం, రుక్కుంబాయిల కూతురు హేమలత(24)కు 2013 మేలో మెదక్ పట్టణంలోని కుమ్మరిగడ్డకు చెందిన పులుగం సతీష్‌తో పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
ఈ ఏడాది జనవరిలో భర్త సతీష్‌తో గొడవపడిన హేమలత ఇంట్లోంచి వెళ్లిపోయి హైదరాబాద్ బోయిన్‌పల్లిలో ఉంటున్న తల్లిగారింటికి చేరుకుంది. అప్పటి నుండి తిరిగి మెదక్‌కు రాలేదు. నాలుగేళ్ల కొడుకు అనిరుధ్‌ను తండ్రి వద్దనే వదిలేసి వెళ్లిపోయింది. ఈ క్రమంలో గురువారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని ట్రాక్టర్ ట్రాలీలు తయారు చేసే వెల్డింగ్ షాప్ వెనుక పూర్తిగా కాలిపోయి శవమై కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ చందన దీప్తి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ భాస్కర్‌లు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
సంఘటన స్థలంలో డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. బుధవారం హైదరాబాద్ నుండి మెదక్ వచ్చినట్లు ఆమె వద్ద ఉన్న పర్సులో బస్సు టికెట్ లభించినట్లు సీఐ తెలిపారు. అయితే హేమలతను ముందుగానే ఎక్కడో హతమార్చి తీసుకొచ్చి ఇక్కడ పడేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment