![Former Deputy CM PA Ramesh Wife Alleges IT Raids Cause Her Husband Death - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/17/karnataka.gif.webp?itok=sguI79_Y)
సాక్షి, బెంగళూరు : తన భర్త ఆత్మహత్యకు ఐటీ అధికారుల వేధింపులే కారణమని కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత పరమేశ్వర పీఏ రమేశ్ భార్య సౌమ్య ఆరోపించారు. ఐటీ అధికారులు తన ముందే తన భర్తను అనేక ప్రశ్నలు వేసి వేధించారని, ఏదో ఒక సమాధానం చెప్పాలంటూ ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. మెడికల్ కళాశాల సీట్ల విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో పరమేశ్వర, ఆయన బంధువుల ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పరమేశ్వర పీఏ రమేశ్ కూడా ఆయన వెంటే ఉన్నారు. ఈ నేపథ్యంలో రమేశ్ శనివారం బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. దీంతో ఐటీ అధికారుల తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.(చదవండి : మాజీ డిప్యూటీ సీఎం పీఏ ఆత్మహత్య)
ఇక మృతుడు రమేశ్ భార్య సౌమ్య బుధవారం రామనగర తాలూకా మెళెహళ్లి గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ తన భర్తను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరమేశ్వర్‌కు తాను టైపిస్టును మాత్రమేనని.. అంతకు మించి తనకు ఏ విషయలూ తెలియవని రమేశ్ ఎంతచెప్పినా ఐటీ అధికారులు వినిపించుకోలేదన్నారు. పదేపదే డబ్బుల గురించి, కాలేజీ వ్యవహారాల గురించి గుచ్చిగుచ్చి అడిగి వేధించారన్నారు. చివరకు రమేశ్ తన బిడ్డపై ప్రమాణం చేసి చెప్పినా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారని ఆరోపించారు. ఈ కేసులో తనను ఇరికించవద్దని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించవద్దని, లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని కూడా రమేశ్ ఐటీ అధికారులకు చెప్పారన్నారు. వేధింపులకు పాల్పడి రమేశ్ చావుకి కారణమైన ఐటీ అధికారులపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆమె విఙ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment