ధ్వంసమైన కారు... చనిగళ్ల హన్మంత్ (ఫైల్) ,మహేశ్వర్ (ఫైల్)
చేవెళ్ల : రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులు దుర్మరణం చెందారు. చిన్నప్పటి నుంచి కలిసి చదవుకున్న వీరు మరణంలోనూ కలిసే ఉన్నారు. బైక్‌పై వెళ్తున్న వీరిని ఎదురుగా వస్తున్న మహేంద్ర జైలో కారు వేగంగా ఢీకొనటంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ బస్‌స్టేజీ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... చేవెళ్ల మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన చనిగళ్ల హన్మంత్ (26), హుస్సేన్‌పురం మహేశ్వర్ (26)లు స్నేహితులు. వీరిద్దరు బైక్‌పై మంగళవారం చేవెళ్ల మండల కేంద్రానికి వచ్చి సాయంత్రం స్వగ్రామానికి వెళ్తున్నారు. మార్గమధ్యలో మీర్జాగూడ బస్‌స్టేజీ దాటగానే ఎదురుగా వికారాబాద్ జిల్లా వైపు నుంచి వస్తున్న మహీంద్ర జైలో కారు వేగంగా వచ్చి రైట్ సైడ్‌లో ఉన్న బైకును ఢీకొట్టింది.
దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు ఎగిరి పడ్డారు. తీవ్ర గాయలై వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వారిని గుర్తించి ఆలూరు గ్రామస్తులకు సమాచారం అందించారు. విషయం తెలియటంతో ఆలూరు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. డిగ్రీలు చదివి ఉద్యోగం కోసం వేచి చూస్తున్న యువకులు కుటుంబానికి ఆధారం అవుతారనుకుంటే ఇలా తిరిగి రాని లోకాలకు చేరుకోవడంతో కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులకు సమాచారం అందించటంతో చేవెళ్ల సీఐ గురువయ్యగౌడ్, ఎస్సై శ్రీధర్‌రెడ్డిలు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కారును వదిలి డ్రైవర్ పారిపోయాడని పోలీసులు తెలిపారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతులిద్దరూ వారి ఇళ్లకు పెద్ద కొడుకులే
వ్యవసాయ కుటుంబానికి చెందిన ఇద్దరు మృతుల తల్లిదండ్రులు కొడుకులను ఉన్నత చదువులు చదివించారు. రెండు కుటుంబాల్లో మృతులిద్దరూ వారి వారి ఇంటికి పెద్ద కొడుకులు కావటం విశేషం. ఆలూరు గ్రామానికి చెందిన చనిగళ్ల గండయ్య, యాదమ్మలకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు హన్మంత్, చిన్నకొడుకు చదువుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన హుస్సేన్‌పురం లక్ష్మయ్య, సైతమ్మలకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు మహేశ్వర్ డిగ్రీ చదివి డైట్ రాశాడు. కుటుంబానికి ఆధారంగా మారుతున్నాడని భావించిన కుటుంబసభ్యులకు రోడ్డు ప్రమాదంలో మహేశ్వర్ మృతి చెందటంతో తీవ్ర దుఖంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment