సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపిన డ్రంకన్ డ్రైవర్లపై నగర ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. గతేడాది ఏకంగా 29,484 కేసులు నమోదు చేసి న్యాయస్థానాల్లో చార్జిషీట్ దాఖలు చేయడంతో 5,441 మందికి 1–3 నెలల పాటు జైలు శిక్షలు పడ్డాయి. 189 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు శాశ్వతంగా రద్దయ్యాయి. 1,235 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను 3–10 ఏళ్ల పాటు రద్దు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. మిగిలిన వారికి రూ.5,88,99,500 జరిమానా విధిం చింది. 2017లో 20,811 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదైతే 4015 మందికి జైలు శిక్ష పడగా, 203 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేశారు.
ఉల్లంఘనులపై కొరడా...
సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, మైనర్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్...ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 894 మందికి జైలు శిక్ష పడింది. ఉన్నత నిబంధనలు అతిక్రమించిన 129 మంది, సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ 212 మంది, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా 401 మంది, మైనర్ డ్రైవింగ్ 42 మంది, డేంజరస్ డ్రైవింగ్ 19 మంది, ఎంవీ యాక్ట్ నిబంధనలు అతిక్రమించిన 11 మంది ఆటో డ్రైవర్లను చంచల్‌గూడ జైలుకు తరలించారని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనిల్ కుమార్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
సైబరాబాద్‌లో 409 మందికి జైలు
న్యూ ఈయర్ వేడుకల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన డ్రంకన్ డ్రైవర్లకు కూకట్‌పల్లి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జైలు శిక్ష విధించింది. 409 మంది డ్రంకన్ డ్రైవర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 111 మందికి మొత్తం 516 మందిని చర్లపల్లి జైలుకు తరలిస్తూ శనివారం ఆదేశించింది. 409 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో ఎక్కువగా మాదాపూర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ (149), కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ (79), గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ (74), మియాపూర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ (55), బాలానగర్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ (52)కేసులు ఉన్నాయి. మూడు నుంచి 25 రోజుల పాటు డ్రంకన్‌డ్రైవర్లకు శిక్ష పడిందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment