నిందితుడిని మీడియాకు చూపి, వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ డి.పోతురాజు
కోడూరు (అవనిగడ్డ) : పగటిపూట అంతర్ జిల్లాల్లో చోరీలకు పాల్పడే దొంగను కోడూరు పోలీసులు శుక్రవారం చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాలను అవనిగడ్డ డీఎస్పీ డి.పోతురాజు స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. మచిలీపట్నం మండలం ముస్తాన్‌ఖాన్‌పేటకు చెందిన పంపన సాయి రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వరస చోరీలకు పాల్పడ్డాడు. తన అనుచరులైన దేవునితోటకు చెందిన పొన్నూరు అంజయ్య, గుంటూరు జిల్లా పిరాట్లంకకు చెందిన మొచ్చా చినఅంకుడుతో కలిసి తణుకు, పాలకొల్లు, కూచిపూడి, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, కంకిపాడు, హంసలదీవి తదితర ప్రాంతాల్లో పగటిపూట చోరీలు చేశాడు. ఆయా ప్రాంతాల్లో నిందితుడు రూ.12 లక్షల విలువ చేసే 400 గ్రాముల బంగారంతో పాటు రూ.లక్షల విలువ చేసే 2.6 కేజీల వెండిని అపహరించాడు. దొంగతనం చేసిన పలు అభరణాలను జ్యూయలరీ షాపుల్లో విక్రయించడంతో పాటు మరికొన్ని ఆభరణాలను కొందరి వద్ద తాకట్టు పెట్టాడు. హంసలదీవిలో పగటిపూట జరిగిన చోరీని దర్యాప్తు చేస్తున్న సమయంలో సాయిపై అనుమానంతో ముందుకు సాగగా ఈ వివరాలు బయటపడినట్లు డీఎస్పీ చెప్పారు.
గతంలో కూడా అనేక చోరీలు..
నిందితుడు సాయి గతంలో కూడా అనేక ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. బందరు, చల్లపల్లి, కైకలూరు, విజయవాడ ప్రాంతాల్లో జరిగిన చోరీల్లో సాయిపై కేసు రుజువు కావడంతో రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో శిక్ష కూడా అనుభవించినట్లు తెలిపారు. గతంలో నిందితుడిపై చల్లపల్లి స్టేషన్‌లో డీసీ షీట్ కూడా తెరిచినట్లు వెల్లడించారు. ఇటీవల సాయి కోడూరుకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకొని ఇక్కడే నివాసముంటున్నాడని, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితుడు దొంగిలించిన రూ.13 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంతో పాటు ఆభరణాల రికవరీకి కోడూరు ఎస్‌ఐ ప్రియకుమార్ తన సిబ్బందితో ఎంతో శ్రమించారన్నారు. ఎస్‌ఐతో పాటు సిబ్బంది శ్రీమన్నారాయణ, సుబ్బారావు, వేణుగోపాల్, శివాజి, గంగరాజు, కిరణ్‌లను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ట్రైనీ డీఎస్పీ రాజ్‌కమల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment