అంతర్ జిల్లా దొంగను అరెస్టు చూపుతున్న పోలీసులు
అతడి చేయిపడితే ఎలాంటి షాపు షెట్టర్ అయినా పైకి లేవాల్సిందే. తను చోరీ చేయాలనుకున్న షాపును పగలు చూసి రాత్రి అక్కడికి చేరుకుంటాడు. చిన్న రాడ్డు సాయంతో అవలీలగా షాపు షెట్టర్‌ను పైకి ఎత్తి షాపులో ఉన్న సొమ్ముతో ఉడాయిస్తాడు. దాదాపు 20 ఏళ్ల వయసులోనే 22 చోరీలు చేశాడంటే అతడు చోర కళలో ఎంత నైపుణ్యం సంపాదించాడో అర్థం చేసుకోవచ్చు.
బనగానపల్లె: అంతర్ జిల్లా దొంగ, కర్నూలులోని స్వామిరెడ్డి నగర్‌కు చెందిన ఈడిగ శివశంకర్‌గౌడ్‌ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ రాకేష్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. మూడు రోజులుగా పట్టణంలోని హిందుస్థాన్ హోటల్ పక్కభాగంలోని పాన్‌బీడాల దుకాణం, ప్రభుత్వాస్పత్రి ఎదురుగా ఉన్న వెంకటేశ్వర మెడికల్ షాపు, చంద్ర టీ స్టాల్ సమీపంలోని దుకాణంలో షెట్టర్లకు ఉన్న తాళాలను తొలగించి అందులో రూ.20 వేల నగదు చోరీకి గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
యనకండ్ల సమీపంలో మంగళవారం సాయంత్రం ఎస్‌ఐ రాకేష్, సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా బేతంచర్ల నుంచి ఆటోలో వస్తున్న శివశంకర్‌గౌడ్ అనుమానాస్పదంగా వ్యవహరించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. పట్టణంలో జరిగిన చోరీలను తానే చేసినట్లు దొంగ అంగీకరించాడు. ఈసందర్భంగా అతడి నుంచి రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగను పట్టుకోవడంలో నైపుణ్యం ప్రదర్శించిన సిబ్బంది సూర్యనారాయణ, సుబ్బరాయుడు, నాగేంద్రగౌడ్, వీర రామరాజులకు సీఐ ప్రోత్సాహక నగదు అందజేశారు. రివార్డుల కోసం జిల్లా ఎస్పీ ప్రతిపాదనలు పంపుతామని సీఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment