మహిళను మోసం చేసి వదిలేసిన కానిస్టేబుల్‌ | Police Constable Cheated A women In Guntur | Sakshi
Sakshi News home page

మహిళను మోసం చేసి వదిలేసిన కానిస్టేబుల్‌

Published Tue, Jul 2 2019 8:16 AM | Last Updated on Tue, Jul 2 2019 8:16 AM

Police Constable Cheated A women In Guntur - Sakshi

అర్బన్‌ ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిట్స్‌ వచ్చి పడిపోయిన బాధితురాలు

సాక్షి, లక్ష్మీపురం(గుంటూరు): ప్రేమ పేరుతో మహిళను వంచించి గర్భవతిని చేసి పరారయ్యడు ఓ కానిస్టేబుల్‌. దీనిపై ఫిర్యాదు చేసేందుకు గుంటూరు అర్బన్‌ ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చిన బాధితురాలు అక్కడే ఫిట్స్‌ వచ్చి పడిపోవడం సంచలనం రేపింది. తాను మూడు నెలల గర్భవతినని, రెండు నెలల నుంచి కడుపు నిండా అన్నం కూడా తినలేదని ఆమె చెప్పడం చుట్టుపక్కలవారిని కలచివేసింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురానికి చెందిన యవతికి తమ ఇంటి పక్కనే నివాసం ఉంటున్న మహేష్‌బాబు అనే వ్యక్తితో 2011లో పరిచయం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారింది.

ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియజేయగా వారు అంగీకరించకపోవడంతో అనంతపురం నుంచి 2018 నవంబర్‌ 5న విజయవాడ వచ్చి దుర్గగుడిలో వివాహం చేసుకున్నారు. అప్పటికే మహేష్‌బాబుకు ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ఇద్దరూ మంగళగిరిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. ఇటీవల యువతి గర్భవతి అయిన విషయం తెలిసి మహేష్‌బాబు ఎంతో సంతోషించాడు. ఈ నేపథ్యంలో మే 2న ఇద్దరూ కలిసి సొంత ఊరైన అనంతపురానికి వెళ్లి ఓ లాడ్జిలో రూం తీసుకున్నారు. అయితే ఆమెను లాడ్జి రూంలో వదిలిపెట్టి వెళ్లిన మహేష్‌బాబు తిరిగి రాలేదు. ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయడంలేదు. దీంతో తిరిగి మే 3న ఆమె మంగళగిరికి చేరుకుని 4వ తేదీన మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు తర్వాత పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి మహేష్‌బాబు కారులో వచ్చి ఆమె చేతిలో రూ.1,000 పెట్టి బయల్దేరుతుండగా, తనను విడిచి వెళ్లొద్దని ఆమె కాళ్లు పట్టుకుని బతిమాలినా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. దీంతో దిక్కుతోచని ఆమె అర్బన్‌ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సోమవారం గ్రీవెన్స్‌కు వచ్చింది. అయితే తన భర్త తనకు ఎందుకు దూరంగా వెళుతున్నాడో తెలియట్లేదని ఆమె కన్నీటి పర్యంతం అయింది. తన గోడును వెళ్లబోసుకోవడానికి సోమవారం అర్బన్‌ ఎస్పీ గ్రీవెన్స్‌కు వచ్చిన ఆమె అక్కడున్న వారితో మాట్లాడుతూ రెండుసార్లు ఫిట్స్‌ వచ్చి పడిపోయింది. అనంతరం తేరుకుని లేచి అర్బన్‌ ఎస్పీకి వినతిపత్రం ఇచ్చే క్రమంలో మళ్లీ మూడోసారి ఫిట్స్‌ వచ్చి పడిపోవడంతో వెంటనే ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ 108 వాహనాన్ని పిలిపించి ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement