పట్టుబడిన ఇసుక ట్రాక్టర్లు (ఇన్‌సెట్) గాయపడిన కానిస్టేబుల్ రామాంజనేయులు
వైఎస్‌ఆర్ జిల్లా , జమ్మలమడుగు : ఇసుకాసురులు రెచ్చిపోయారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను ఆపమని పోలీసులు అడ్డగించారు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ చెండ్రాయుడు ఆపకుండా వేగంగా పోలీసులపైకి దూసుకెళ్లాడు. తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులు స్కూటర్‌లో నుంచి కిందకు దూకారు. ప్రమాదంలో రామాంజనేయులు అనే కానిస్టేబుల్ ఎడమ చేతి ఎముక విరగడంతో మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించారు.
వివరాలిలా...
గొరిగేనూరు గ్రామానికి చెందిన ట్రాక్టర్లు పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆదివారం తెల్లవారు జామున పోలీసులకు సమాచారం వచ్చింది. డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు తాడిపత్రి బైపాస్‌రోడ్డుకు వెళ్లారు. అప్పటికే శేషారెడ్డిపల్లె రహదారిలో ఇసుక ట్రాక్టర్లు వెళుతుండడంతో వారిని ఆపాలంటూ పోలీసులు సూచించారు. నిలిపితే పట్టుకుంటారనే ఉద్దేశంతో డ్రైవర్లు మరింత వేగం పెంచి ట్రాక్టర్లను ముందుకు పోనిచ్చారు. పోలీసులు ద్విచక్రవాహనంపై వెళ్లి వారిని వెంబడించారు. ఈక్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ చెండ్రాయుడు పోలీసులపైకి దూసుకెళ్లాడు. తప్పించుకునే ప్రయత్నంలో అదుపు తప్పి పోలీసులు కింద పడ్డారు. ఘటనలో కానిస్టేబుల్ రామాంజనేయులు గాయపడగా చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానిక వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరుకు తరలించారు.
దాడులు చేసిన పోలీసులు
కానిస్టేబుళ్లపై దాడికి యత్నించిన ఇసుకట్రాక్టర్లను పట్టుకోవడానికి సీఐ కత్తిశ్రీనివాసులు, ఎస్‌ఐ మౌలాపీర్, రంగరావులతోపాటు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు ఏడు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. విధులకు ఆటంకం కలిగించిన చెండ్రాయుడు, మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కత్తిశ్రీనివాసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment