గజదొంగ దున్న కృష్ణ అరెస్ట్‌ | Thief Dunna Krishna Arrest in Visakhapatnam | Sakshi
Sakshi News home page

గజదొంగ దున్న కృష్ణ అరెస్ట్‌

Published Sat, Dec 8 2018 6:58 AM | Last Updated on Sat, Dec 8 2018 6:58 AM

Thief Dunna Krishna Arrest in Visakhapatnam - Sakshi

దున్న కృష్ణ నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగలు, (ఇన్‌సెట్‌లో) దున్న కృష్ణ

విశాఖ క్రైం: విశాఖతోపాటు విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న గజదొంగ దున్న కృష్ణ అలియాస్‌ రాజును నగర పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీస్‌ కమిషనరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేష్‌చంద్ర లడ్డా  వెల్లడించారు. సెల్‌ఫోన్‌ వాడకుండా నేరాలకు పాల్పడుతూ మధ్యవర్తులతో వ్యవహారం నడుపుతున్న దున్న కృష్ణ మూడు నెలల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడన్నారు. గత ఏడాది అక్టోబరులో రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి బయటకు వచ్చి వరుసగా దొంగతనాలు చేస్తున్నాడని తెలిపారు. అప్పటి నుంచి నగరంలోని ఎంవీపీ జోన్‌ పోలీస్‌ స్టేషన్‌లో 25, ద్వారకా జోన్‌ స్టేషన్‌లో 6, ఫోర్తుటౌన్‌లో 2, ఎయిర్‌పోర్టు జోన్, ఆరిలోవ, మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లలో ఒక్కో కేసు నమోదైందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రిలో ఒక్కో కేసు నమోదైందన్నారు. ఇవేకాకుండా కృష్ణపై సుమారు 300 పాత కేసులు ఉన్నాయని, 150 కేసుల్లో జెలుకెళ్లి వచ్చినా మార్పు రాలేదని పేర్కొన్నారు. కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌లో డీసీ(డోసియర్‌) షీట్‌ ఉన్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో క్రైం డీసీపీ ఎల్‌.ఆర్‌.దామోదర్, క్రైం అదనపు డీసీపీ వి.సురేష్‌బాబు పర్యవేక్షణలో ఏసీపీ (సీసీఎస్‌) వై.గోవిందరావు, ఇన్‌స్పెక్టర్లు కె.దుర్గాప్రసాద్, సీహెచ్‌ లక్ష్మణరావు, వి.శ్రీనివాసరావు, సీహెచ్‌ షణ్ముఖరావు, ఆర్‌.సత్యనారాయణ, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు వి.అప్పలనాయుడు, బి.లూథర్‌బాబు, ఎన్‌.జోగారావు, డి.సూరిబాబు, ఎ.విజయ్‌కుమార్, ఎన్‌వీ భాస్కర్‌రావు, బి.మధుసూధనరావు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో భిన్న కోణాల్లో దర్యాప్తు చేశారని సీపీ తెలిపారు. పక్కా సమాచారంతో బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ముడసర్లోవ వద్ద కృష్ణతోపాటు అతని అనుచరుడు చింతాడ సారథిలను అరెస్ట్‌ చేశామని తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో తాళాలు రిపేరు చేసే అబ్దుల్‌ రషీద్, చెప్పుల దుకాణం యజమాని ముడగ రమణ, కృష్ణ దొంగలించిన సొత్తు కొనుగోలు చేసిన దుస్తుల వ్యాపారి కింతలి గోపాలకృష్ణ, బంగారు దుకాణాల యజమానులు జామి రితేష్, పుసర్ల శ్రీనివాసరావులను కూడా అరెస్ట్‌ చేశామని సీపీ తెలిపారు. నిందితుల నుంచి 1135 గ్రాముల బంగారు ఆభరణాలు, 5.175కిలోల వెండి వస్తువులు, రూ.1.88లక్షల నగదు, ఎల్‌ఈడీ టీవీ, రెండు వాచీలు, సూట్‌ కేసు, మోటారు సైకిల్, 7.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మార్కెట్‌ విలువ ప్రకారం స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ సుమారు రూ.40.77 లక్షలు ఉంటుందన్నారు. త్వరలో చైన్‌స్నేచర్స్‌ను పట్టుకుంటామని తెలిపారు. ఈ కేసుల్లో 33 మంది పోలీసులు నిఘా వేసి పట్టుకున్నారని తెలిపారు.

సిబ్బందికి రివార్డులు
గజ దొంగ దున్న కృష్ణను చాకచాక్యంగా పట్టకున్న ఏసీపీ వై.గోవిందరావుతో పాటు కె.దుర్గాప్రసాద్, సీహెచ్‌ లక్ష్మణరావు, వి.శ్రీనివాస్‌రావు, సీహెచ్‌.షణ్ముఖరావు, ఆర్‌.సత్యనారాయణతోపాటు ఎస్‌ఐలు లూథర్‌బాబు, వి.అప్పలనాయుడు, ఎన్‌.జోగారావు, డి.సూరిబాబు, ఎ.విజయకుమార్, ఎన్‌.వి.భాస్కరరావు, బి.మధుసూధనరావు, సీసీఎస్‌ కానిస్టేబుళ్లు 18 మందికి సీపీ రివార్డులు అందజేశారు.

యుక్తవయసు నుంచీ నేరబాటే
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన కృష్ణ చిన్ననాటి నుంచి నగరంలోని కంచరపాలెంలో నివాసం  ఉండేవాడు. అక్కడే చదువుకుని వ్యసనాలకు బానిసై 19వ ఏట నుంచే దొంగతనాల బాట పట్టాడు. 1993లో సైకిల్‌ దొంగతనంతో మొదలుపెట్టి ఇళ్ల దొంగతనాల బాటపట్టాడు. జైలులో ఇతర దొంగల స్నేహంతో గజదొంగలా మారి పోలీసులకు సవాల్‌గా తయారయ్యాడు. ముఖ్యంగా తాళాలు వేసి ఉన్న ఇళ్లపై పగలు రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో  నగదు, బంగారు ఆభరణాలు దోచుకుపోయేవాడు. అనంతరం ఆ సొత్తు విక్రయించి జల్సాలు చేసేవాడు. ఇటీవల కాలంలో పోలీసుల నిఘా పెరగడంతో బొబ్బిలి సమీపంలోని గ్రామానికి మకాం మార్చేశాడు. అక్కడ తనను రాజు అని పరిచయం చేసుకుని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో నగరానికి రావడంతో ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement