ఆదివాసీల ఆందోళన ఉధృతం | Adivasis agitation | Sakshi
Sakshi News home page

ఆదివాసీల ఆందోళన ఉధృతం

Published Sun, Feb 23 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

Adivasis agitation

భద్రాచలం, న్యూస్‌లైన్:తమను గోదావరిలో నిండా ముంచే పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలన్న డిమాండుతో కొద్ది రోజులుగా భద్రాచలం డివిజన్‌లో ఆదివాసీలు సాగిస్తున్న ఆందోళన లు ఉధృతమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలంటూ ఆదివాసీ సంక్షేమ పరిషత్, ఆదివాసీ విద్యార్ధి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో వీఆర్ పురం మండలంలో ఈ నెల 18న ప్రారంభమైన పాదయాత్ర ఐదవ రోజయిన శనివారం భద్రాచలం చేరుకుంది. పాదయాత్రగా వచ్చిన ఆదివాసీ సంఘం కార్యకర్తలు, నాయకులు ఐటీడీఏ కార్యాలయం ప్రధాన గేటు ముందు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు ఉయిక శంకర్ మాట్లాడుతూ.. ఆదివాసీల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించి, వారు నివసిస్తున్న భూభాగంలో ప్రాజెక్టు నిర్మించడం దారుణమని అన్నారు.
 
 ఆదివాసీల గ్రామ సభ తీర్మానం లేకుండానే పెసా చట్టానికి విరుద్ధం గా ఆదివాసీలను జల సమాధి చేసేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. రాష్ట్ర పునర్విభజన, పోలవరం నిర్మాణంతో 350 ఆదివాసీ గ్రామాలు, ఐదులక్షల మంది ఆదివాసీలు ముంపునకు గురవుతారని, వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేం దుకు ఆదివాసీ ఎమ్యెల్యేలు, ఎంపీలు ముందుకు రాకపోతే.. వచ్చే ఎన్నికల్లో వారికి భంగపాటు తప్పదని హెచ్చరించారు. అనంతరం, ఐటీడీఏ ఏపీఓకు వినతిపత్రం ఇచ్చారు.
 ఈ కార్యక్రమంలో ఏవీఎస్‌ఎపీ రాష్ట్ర కార్యదర్శి పూనెం రాంచందర్, నాయకులు పూనెం శ్రీను, సోమం కామరాజు, చిరంజీవి, సరియం సురేందర్, సోడె రామకృష్ణ, కుంజా రమాదేవి, కుర్సం రవి, నూపా రమేష్ పాల్గొన్నారు.
 
 కొండరెడ్ల వినూత్న నిరసన
 
 పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలన్న డిమాండుతో ఆదివాసీ కొండరెడ్ల సంఘం ఆధ్వర్యంలో కొండరెడ్లు భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహం ఎదుట మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ముర్ల రమేష్ మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుతో కొండరెడ్ల జాతి పూర్తిగా కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఆదివాసీలు, రాజకీయ పార్టీలు ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ముర్ల జగపతిరెడ్డి, కదల కృష్ణారెడ్డి, వెంకటలక్ష్మి, సోకుల గోపిరెడ్డి, అందెల గంగిరెడ్డి, ముర్ల ఉమాదేవి, అందెల దుర్గ, చదల దుర్గ, సుమిత్ర, కదల వెంకటేశ్వరరెడ్డి, కెచ్చెల వెంకటేశ్వరరెడ్డి, వల్ల భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement