బీమా పడగ నీడలో భద్రమ్....!
బీమా పడగ నీడలో భద్రమ్....!
Published Mon, Aug 8 2016 10:58 PM | Last Updated on Tue, Aug 21 2018 8:07 PM
బీమా పేరుతో భారీ దోపిడీ
∙కోటనందూరు మండలంలో రూ.30 కోట్లు స్వాహా!
∙తెల్లకార్డులున్న నిరుపేదలకూ భారీ పాలసీలు
∙తప్పుడు ధ్రువపత్రాతో అక్రమాలు
∙మరణానికి చేరువగా ఉన్నవారే లక్ష్యం
ముక్కూమొహం తెలియని వ్యక్తి పేరున బీమా చేస్తారు. బీమా చేశారన్న విషయం ఆ వ్యక్తికీ తెలియదు. కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి అనూహ్యంగా హత్యకు గురవుతాడు. తనను ఎందుకు చంపుతున్నారో కూడా అతడికి అంతుపట్టదు. అతడి పేరున బీమా మొత్తాన్ని గుర్తుతెలియని వ్యక్తులు కాజేస్తారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు పదుల సంఖ్యలో జరుగుతోంది. ఇదేదో సినిమా కథలా ఉంది కదూ. ఏడాది క్రితం విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఇంచుమించు ఇదే తరహా సంఘటనలు జిల్లాలోనూ చోటుచేసుకుంటున్నాయి. దీని తీగలాగితే మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. – కోటనందూరు
మరికొన్నాళ్లలో మరణించే వారి పేరున భారీ మొత్తంలో బీమా పాలసీ చేయించి, వారు చనిపోయాక ఆ పరిహారంలో ఏజెంట్లు వాటా దండుకున్న సంఘటనలు కోటనందూరు మండలంలో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా భీమవరపుకోటలో జరిగిన ఇలాంటి వ్యవహారంపై పోలీసు కేసు నమోదు కావడంతో, నకిలీ బీమా పాలసీల బాగోతంలో తీగ దొరికినట్టయింది.
బహుళజాతి బీమా కంపెనీల్లో కొందరు ఏజెంట్లు.. ప్రాణాంతక వ్యాధులతో, మరణానికి చేరువులో ఉన్న వారి వివరాలను ముందుగా సేకరిస్తారు. ఈ ప్రక్రియలో వైద్యవృత్తిలో ఉన్నవారు, వ్యాధిగ్రస్తుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకుంటారు. వ్యాధిగ్రస్తుల బంధువులను కలసి, బీమా వ్యవహారంలో ఓ ఒప్పందం కుదుర్చుకుంటారు. ప్రీమియం మొత్తం ఏజెంట్ చెల్లిస్తే, పరిహారం మంజూరయ్యాక కొంతభాగం బాధిత కుటుంబానికి ఇవ్వడానికి, ఒకవేళ ప్రీమియం వ్యాధిగ్రస్తుల బంధువులు చెల్లిస్తే, చెరిసగం పంచుకునేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. భారీగా నగదు వస్తుందన్న ఆశతో నిరుపేద కుటుంబాల వారు సైతం పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించడానికి వెనుకాడడం లేదు.
సాధారణంగా నిర్ణీత వయస్సు వారికి మాత్రమే బీమా సౌకర్యం ఉంటుంది. వృద్ధులకు కూడా తక్కువ వయస్సు నమోదు చేయించి, ఎలాంటి వైద్య పరీక్షలు చేయించకుండానే ధ్రువపత్రాలు సృష్టిస్తున్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న నిరుపేద కుటుంబాల వారు కూడా భారీ మొత్తంలో పాలసీ తీసుకుంటున్నప్పటికీ, బీమా కంపెనీలు ఎందుకు జాగురుకతతో వ్యవహరించడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిహారం మంజూరు కోసం వస్తున్న విచారణాధికారులకు ముడుపులు అందుతున్నాయనేది బహిరంగ రహస్యమే. స్థిరమైన పెద్ద బీమా కంపెనీల జోలికి ఈ ఏజెంట్లు వెళ్లడం లేదు. కొత్తగా వచ్చిన బీమా కంపెనీలనే వీరు బురిడీ కొట్టిస్తున్నారు.
రూ.30 కోట్లు హుష్‌కాకి!
పదేళ్లుగా కేవలం కోటనందూరు మండలంలోనే సుమారు రూ.30 కోట్ల మేరకు ఇలా కాజేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో బీమా ఏజెంట్లను కంపెనీ తొలగించగా, మరలా వారే బినామీ పేర్లతో పాలసీలు చేయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సుమారు ఎనిమిది కంపెనీలకు ఈ ప్రాంతంలో దాదాపు 20 మంది వరకూ ఏజెంట్లు ఇలాంటి వ్యవహారాల్లో చక్రం చక్రం తిప్పుతూ, అనతికాలంలోనే లక్షలాది రూపాయలు గడించారని సమాచారం. ఇలాంటి వ్యవహారాలు కోటనందూరు, జగన్నాథపురం, భీమవరపుకోట, కాకరాపల్లి తదితర గ్రామాల్లో జరుగుతున్నట్టు తెలిసింది.
బీమా మోసాలపై ఫిర్యాదు చేయండి
త్వరలో చనిపోతారని భావించిన వారి పేరున బీమా పాలసీ చేయించి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై సరైన సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తే, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై గోపాలకృష్ణ తెలిపారు. కోటనందూరులో ఇలాంటి చర్యలు ఎక్కువగా జరుగుతున్నట్టు సమాచారం ఉందన్నారు.
Advertisement
Advertisement