104కు బ్రేక్
మోర్తాడ్ : పల్లె ముంగిట్లోనే ప్రజలకు వైద్య సేవలు అందించడానికి నిర్దేశించిన 104 వాహనాలను డీజిల్ కొరత వెంటాడుతోంది. డీజిల్ పోయించడానికి అవసరమైన నిధుల కేటాయింపులో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 104 వాహనాలకు డీజిల్ అరువు పోసేందుకు పెట్రోల్ బంక్ యజమానులు అభ్యంతరం చెప్పడంతో జిల్లాలోని పలు క్లస్టర్‌ల వాహనాలు ఆసుపత్రి ఆవరణలకే పరిమితమయ్యాయి. దీంతో కొన్ని రోజులుగా గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు మృగ్యమయ్యూరుు.
జిల్లాలోని మోర్తాడ్, బాల్కొండ, డిచ్‌పల్లి, ధర్పల్లి, నవీపేట్, కోటగిరి, వర్ని, ఆర్మూర్, బిచ్కుంద, దోమకొండ, పిట్లం, ఎల్లారెడ్డి, మద్నూర్, గాంధారి హాస్పిటల్స్‌ను క్లస్టర్ ఆసుపత్రులుగా మార్చారు. 104 వైద్య సేవలు ప్రారంభించినప్పుడు రెవెన్యూ డివిజన్‌లకు వాహనాలను కేటాయించి గ్రామాలలో రోజూ వైద్య సేవలు అందించేవారు. క్లస్టర్ ఆసుపత్రుల ఏర్పాటు తరువాత వాహనాలను ఒక్కో హాస్పిటల్‌కు ఒక వాహనం చొప్పున కేటాయించారు. ప్రతి వాహనంలో ఒక పెలైట్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు. క్లస్టర పరిధిలోని గ్రామాలకు వెళ్లి ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించడం వీరి విధి. ఇలా ఒక్కో వాహనం రోజుకు కనీసం రెండు గ్రామాల్లో పర్యటిస్తుంది.
ప్రబలుతున్న వ్యాధులు..
ఇప్పటికే గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ సమయంలో 104 వైద్య సేవలు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రెండు, మూడు నెలలుగా ప్రభుత్వం డీజిల్ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో పెట్రోల్ బంకుల్లో అరువు ఖాతాలను తెరిచారు. అవి కూడా ఎక్కువ కావడంతో మోర్తాడ్, ఆర్మూర్‌లకు సంబంధించిన వాహనాలకు బంక్ యజమానులు డీజిల్ పోయడానికి నిరాకరించినట్లు తెలిసింది. ఇతర క్లస్టర్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 14 వాహనాలకు గాను 5 వాహనాలు వారం రోజుల నుంచి గ్రామాలకు వెళ్లడం లేదు.
డీజిల్ నిధులను అడ్వాన్స్‌గా ఇస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నా పెట్రోల్ బంకులలో బిల్లులు చెల్లించడం లేదంటే నిధుల కొరత ఉన్నట్లు స్పష్టం అవుతోంది. గతంలో కూడా వాహనాలు రిపేర్‌కు వస్తే నిధులు లేక రోజుల తరబడి గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందలేదు. ప్రభుత్వం స్పందించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించే 104 వాహనాలకు నిధుల కొరత లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
రెండు, మూడు రోజుల్లో నిధులు వస్తాయి
‘104 వాహనాలకు డీజిల్ నిధుల కోసం కలెక్టర్ కార్యాలయానికి ప్రతి పాదనలు పంపాం. రెండు మూడు రోజుల్లో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. డీజిల్‌కు నిధులు లేకపోయినా క్లస్టర్ ఆసుపత్రిలో ఉండే ఇతర నిధులను వినియోగించడానికి వీలుంది. దీనిపై క్లస్టర్ ఆసుపత్రి అధికారులకు గతంలోనే మార్గదర్శకాలు జారీ చేశాం.
- దేవసాయం, అడ్మినిస్ట్రేటివ్ అధికారి, నిజామాబాద్