‘బాబు’ది రావణాసుర పాలన : ముద్రగడ
ఆరు నూరైనా ముహూర్తానికే సత్యాగ్రహ యాత్ర
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో రావణాసుర పాలన సాగిస్తున్న చంద్రబాబు.. కాపు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు కుట్ర చేస్తున్నారని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. రిజర్వేషన్ల కోసం కాపు జాతి ఏనాడూ దేహీ అనలేదన్నారు. అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా కాపు సత్యాగ్రహ యాత్ర చేపట్టడం తథ్యమని స్పష్టం చేశారు. ఈ యాత్ర విషయమై తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు జేఏసీ నేతలతో ముద్రగడ ఆదివారం సమావేశమయ్యారు. అనంతరం తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తనను అంతర్జాతీయ తీవ్రవాదిగా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రావులపాలెంలో ఈ నెల 16వ తేదీ ఉదయం 9 గంటలకు సత్యాగ్రహ పాదయాత్ర ప్రారంభింస్తున్నట్లు ముద్రగడ ప్రకటించారు. గ్రామాల్లో పోలీసులను మోహరించడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం మంచిది కాదన్నారు.