పట్టు అధరహో..
– రికార్డు స్థాయిలో పట్టుగూళ్ల ధరలు
– హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సంప్రదాయ వేరుశనగతోపాటు ఇతర పంటలు కూడా చేతికందడం లేదు. భూగర్భజలాలు అడుగంటిపోయాయి. మరోవైపు అరకొర దిగుబడి వచ్చినా వాటికి సరైన ధరలు లేవు. ప్రత్యామ్నాయంగా చేపట్టిన మల్బరీసాగు అంతరించి పోతున్న తరుణంలో పట్టు గూళ్లకు రికార్డు స్థాయిలో ధరలు లభిస్తున్నాయి. మడకశిర, హిందూపురం, కళ్యాణదుర్గం, పెనుకొండ, కదిరి ప్రాంతాలలో మల్బరీ పంట సాగవుతోంది. రికార్డుస్థాయి ధరలు చూసి మరికొంతమంది రైతులు మల్బరీ సాగుపై మొగ్గుచూపుతున్నారు.
ధరలు ఆశాజనకం..
జిల్లాలో 30వేల ఎకరాల్లో మల్బరీ సాగవుతోంది. ధర్మవరం పట్టుగూళ్ల మార్కెట్‌లో బైవోల్టిన్ రకం గూళ్లకు కిలో రూ.450 నుంచి 466 వరకు ధర పలుకుతోంది. వీటితో పాటు కిలోకు రూ.50 అదనంగా ప్రభుత్వం రైతులకు బోనస్‌గా ఇస్తోంది. సీబీ రకం పట్టుగూళ్లకు రూ.10 బోనస్‌గా ఇస్తోంది.
ఏ ప్రాంతాల నుంచి వస్తున్నాయంటే...
ఇటీవల కాలంలో పట్టుగూళ్లకు మంచి ధరలు ఉండడంతో కర్ణాటక ప్రాంతానికి వెళ్లే రైతులు చాలా మంది ధర్మవరం పట్టుగూళ్ల మార్కెట్‌కు గూళ్లను తీసుకువస్తున్నారు. కర్నూలు, కళ్యాణదుర్గం, పెనుకొండ తదితర ప్రాంతాల నుంచి సరాసరి రోజుకు 1500 కేజీల నుంచి 2000 కేజీల వరకు పట్టుగూళ్లు వస్తున్నాయి.
రీలర్లు ఎంత మంది ఉన్నారంటే..
నాలుగేళ్ల క్రితం 60 నుంచి 70 మంది దాకా రీలర్లు ధర్మవరం పట్టుగూళ్ల మార్కెట్‌కు వచ్చి వేలం పాటలో పాల్గొనే వారు. అయితే పట్టుగూళ్లు అటు ఇటుగా వస్తుండడంతో ప్రస్తుతం 18 నుంచి 20 మంది రీలర్లు మాత్రమే వస్తున్నారు.