జీఎస్టీలోకి.. | Discounts rain down on shoppers in Khammam, Nizamabad districts | Sakshi
Sakshi News home page

జీఎస్టీలోకి..

Published Sat, Jul 1 2017 1:53 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

జీఎస్టీలోకి.. - Sakshi

జీఎస్టీలోకి..

► లాభమా..  నష్టమా !
► సామాన్యుల్లో సందేహాలు.. వ్యాపారుల్లో ఆందోళనలు
► రాష్ట్ర పన్నుల శాఖగా.. వాణిజ్యపన్నుల శాఖ
► స్టాకు వివరాలు ఇవ్వాలని వ్యాపారులకు ఆదేశాలు
► సెంట్రల్‌ ఎక్సైజ్‌ ఆధ్వర్యంలో నేడు ఆవిష్కరణ
► సాలూర చెక్‌పోస్టు ఎత్తివేత


నిజామాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ పరిధిలో..
♦ నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు
♦ ఈ సర్కిళ్లలో ప్రస్తుతం 18,820 వ్యాపార, వాణిజ్య సంస్థలు
♦ జీఎస్టీలోకి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నవి సుమారు ఆరు వేలు



సెంట్రల్‌ జీఎస్టీ..
♦ నిజామాబాద్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పరిధిలో నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాలు
♦ కరీంనగర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పరిధిలోకి.. కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు


సాక్షి, నిజామాబాద్‌ : నూతన పన్నుల విధానం జీఎస్టీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. సామాన్య ప్రజల్లో ఎన్నో సందేహాలు.. తమకు లాభమా..  నష్టమా.. వ్యాపారుల్లో ఒకింత ఆందోళనలు.. ఇలా నూతన పన్ను విధానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర పన్నుల శాఖగా రూపాంతరం చెందిన వాణిజ్యపన్నుల శాఖ ఈ నూతన పన్ను విధానాన్ని అమలు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఎస్జీఎస్టీ పన్ను విధానం ఈ శాఖ పరిధిలోకి రానుంది.

ఈ కొత్త పన్ను విధానం ప్రారంభం కావడంతో మీ వద్ద ఉన్న స్టాకు వివరాలు ఇవ్వాలని వ్యాపారులకు రాష్ట్ర పన్నుల శాఖ (వాణిజ్యపన్నుల) అధికారులు జిల్లాలోని వ్యాపారులందరికీ ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు జిల్లా పరిధిలోని అన్ని చెక్‌పోస్టులను ఎత్తేశారు. సాలూరలోని అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం శుక్రవారం మూతపడింది. రాష్ట్ర పన్నుల శాఖ నిజామాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం పరిధిలో నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట్‌ జిల్లాలు వస్తాయి.

ఈ జిల్లాల్లో ఎనిమిది సర్కిళ్లు ఉన్నాయి. ఈ సర్కిళ్లలో ప్రస్తుతం 18,820 వ్యాపార, వాణిజ్య సంస్థలు వ్యాట్‌ లైసెన్సు విధానంలో రిజిస్టర్‌ అయిఉన్నాయి. నూతన పన్ను విధానానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ (మైగ్రేషన్‌) ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఈ రిజిస్ట్రేషన్‌కు గడువు ఈ నెల 15తో ముగిసినప్పటికీ కనీసం సగం కూడా వ్యాపార, వాణిజ్య సంస్థలు జీఎస్టీలోకి రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యాపార, వాణిజ్య సంస్థలు సుమారు ఆరు వేలు మాత్రమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.

అందని మార్గదర్శకాలు..
రాష్ట్ర పన్నుల శాఖగా రూపాంతరం చెం దిన వాణిజ్య పన్నుల శాఖ జిల్లా అధి కారులకు  జీఎస్టీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుక్రవారం రాత్రి వరకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదు. ఈ పన్ను విధానంలో సంబంధిత అధికా రుల బాధ్యతలు, విధులు, పరిధి వంటి అంశాలపై స్పష్టత లేకుండా పోయింది. దీనికి తోడు రాష్ట్ర స్థాయిలో జీఎస్టీ నోటిఫికేషన్‌ కూడా రావాల్సి ఉందని ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

సెంట్రల్‌ జీఎస్టీ పన్ను..
సెంట్రల్‌ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ పన్నులు వసూలు చేయనున్న కేంద్ర ప్రభుత్వ శాఖ కస్టమ్స్, సెంట్రల్‌ ఎక్సైజ్‌శాఖ కూడా ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నిజామాబాద్‌లోని ఉన్న అసిస్టెంట్‌ కమిషనర్‌ పరిధిలో కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాలు ఉండేవి. శనివారం నుంచి వీటి పరిధిలో సమూల మార్పులు జరగనున్నాయి. కామారెడ్డి జిల్లా కరీంనగర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పరిధిలోకి వెళ్లింది.

అలాగే ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు కూడా కరీంనగర్‌ పరిధిలోకి మారాయి. ప్రస్తుతం నిజామాబాద్, నిర్మల్, ఆది లాబాద్‌ జిల్లాలు మాత్రమే ఈ కార్యాలయం పరిధిలో ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల పరిధిలో సర్వీస్‌ ట్యాక్స్‌ చెల్లిస్తున్న వ్యాపార, వాణిజ్య సంస్థలు సుమారు రెండు వేల వరకు ఉంటాయి. అలాగే సెంట్రల్‌ ఎక్సైజ్‌ పన్ను చెల్లిస్తున్న సంస్థలు సుమారు 400 వరకు ఉన్నాయి.

ఆవిష్కరణ కార్యక్రమాలు..
నూతన పన్ను విధానాన్ని స్వాగతించేం దుకు రాష్ట్ర, కేంద్ర పన్నుల శాఖ కార్యాలయాలు  ఏర్పాట్లు చేస్తున్నాయి. శనివా రం ఉదయం 11 గంటలకు జిల్లా కేం ద్రంలోని కేంద్ర పన్నుల శాఖ కార్యాలయంలో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రెండు శాఖల అధికారులు పాల్గొంటారు.

అవగాహన కల్పించడంలో విఫలం..
నూతన పన్ను విధానంపై జిల్లాలోని వ్యాపార, వాణిజ్య వర్గాలకు అవగాహన కల్పించడంలో ఈ రెండు శాఖల జిల్లా అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సిన ఈ శాఖల అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. దీంతో సామాన్యులకు ఈ పన్ను విధానంపై ఎన్నో అపోహలు నెలకొన్నాయి. ఇటు వ్యాపార, వాణిజ్య వర్గాల్లోనూ ఒకింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement