ఒంగోలు సెంట్రల్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగు ప్రాజెక్టు పరిధిలో పౌష్టికాహార కేంద్రాలను గతంలో ఏర్పాటు చేశారు. అయితే పిల్లల పౌష్టికాహార కేంద్రాలన్నీ స్త్రీశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో వెలుగు పౌష్టికాహార కేంద్రాలు మూత పడ్డాయి. జిల్లా పరిధిలో 15 మండలాల్లో 139 కేంద్రాలు పనిచేసేవి. వీటికి గాను అప్పట్లో రూ.4.17 కోట్లు వెచ్చించారు. ఈ నిధుల నుంచి వంట సామగ్రి, గ్యాస్, పిల్లలకు ఆట వస్తువుల కొనుగోలుకు ప్రతి కేంద్రానికి దాదాపు రూ.50 వేల వరకూ వెచ్చించారు.
మూడేళ్లపాటు నడిచిన ఈ కేంద్రాలను ఏడాదిన్నర కాలంగా మూసేశారు. ఈ కేంద్రంలో పని చేసిన సిబ్బంది, ఆయాలకు కొన్ని నెలల జీతాలు కూడా ఇవ్వలేదు. కానీ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయాయి. ప్రస్తుతం ఆరోగ్య, పోషణ కేంద్రాల గురించి, వాటికి మంజూరైన నిధులు, సామగ్రి ఎక్కడ, ఎంత ఉన్నాయనే విషయం కూడా తెలియదు. నిధులు ఎక్కడికక్కడ దొరికినంత దోచుకున్నారు. సామగ్రిని సొంతానికి వాడేసుకున్నారు.
నిధులు...కేంద్రాలు ఎక్కడ
పొదుపు మహిళలు కొందరు దినసరి కూలీకి వెళ్తుంటారు. వీరి పిల్లలు, అనాథ పిల్లల కోసం ఆరోగ్య పోషణ కేంద్రాలను 2011లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది. జిల్లాలో బాగా వెనుకబడిన 15 మండలాల్లో మొత్తం 139 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి రూ.3 లక్షల చొప్పున నేరుగా సెర్ప్ సీఈవో డీఆర్‌డీఏకు మంజూరు చేశారు. వీటిలో రూ.10 వేలు చొప్పున వంట సామగ్రి, మరో రూ.20 వేలతో చిన్నపిల్లల సైకిల్, క్యారమ్ బోర్డు, బొమ్మలు, తదితర ఆట వస్తువులను కొనుగోలు చేశారు.
మొత్తం మీద రూ.50 వేలు వరకూ ఇలా వెచ్చించారు. మొత్తం అన్ని కేంద్రాల్లో కలిపి రూ.69,50,000లను ఖర్చు చేశారు. అప్పట్లో సామగ్రి కొనుగోలు పై అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అవినీతిలో అందరూ భాగస్వామ్యం అయ్యారు. ఇప్పుడు కేంద్రాలు లేవు, వాటికి కొనుగోలు చేసిన వస్తువులూ కనిపించడం లేదు. ఎవరికి దొరికింది వారు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై డీఆర్‌డీఏ-వెలుగు యంత్రాంగం కనీసం వాకబు కూడా చేయని దుస్థితిలో ఉంది.
మొత్తం రూ.4.17 కోట్లలో వంట సామగ్రి, ఆట వస్తువుల కోసం రూ.69.50 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు రాశారు. ఒక్కో కేంద్రానికి రూ.3 లక్షలు ఇచ్చారు. వీటిలో రూ.50 వేల వరకూ వంట, ఆట వస్తువులకు కేటాయించారు. తక్కిన రెండున్నర లక్షలు పోషకాహార కేంద్రాలు ఉన్న గ్రామంలోని డ్వాక్రా సంఘాలకు సామాజిక పెట్టుబడి నిధి రూపంలో అన్ని కేంద్రాలకు కలిపి మొత్తం రూ.3,47,50,000 రుణాలను ఇచ్చారట.
ఈ రుణాలకు వచ్చే వడ్డీతోనే పోషకాహార కేంద్రాలను నిర్వహించాల్సి ఉంది. కేంద్రాలను నడి పే ఆరోగ్య కార్యకర్తకు నెలకు రూ.1000లు, ఆయాకు రూ.300ల చొప్పున వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏ సంఘానికి ఎంత రుణం ఇచ్చారు. ఎంత రికవరీ అయింది, మిగిలింది ఎంత అనే సమాచారం వెలుగు అధికారుల వద్ద లేదు. ఆ మొత్తంలో అత్యధికంగా పలుకుబడి ఉన్న మహిళా సంఘాలు, కొందరు వెలుగు ఉద్యోగులు పంచుకుని తినేశారన్న విమర్శలున్నాయి.
ఇక వంట సామగ్రి, ఆట వస్తువులు కూడా కేంద్రాల్లో లేవు. చాలా చోట్ల ఎవరికి చిక్కినివి వారు తీసుకువెళ్లిపోయారు. కొన్ని చోట్ల ర్యాకులు, టీవీలు కొనుగోలు చేశారు. అయితే ఏ ఒక్క చోట కూడా ఈ వస్తువులు కనిపించడం లేదు. ఇంత భారీ ఎత్తున అవినీతి జరిగితే ఎవరూ పట్టించుకోకపోవడం చూస్తుంటే ఈ పాపంలో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దొరికినంత దోచేశారు..
Published Tue, Jun 21 2016 8:37 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM
Advertisement
Advertisement