కుటుంబ సమస్యలపై రావద్దు
Published Tue, Aug 23 2016 12:10 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
‘మీ కోసం’లో కలెక్టర్ భాస్కర్
ఏలూరు (మెట్రో) :
మీ కోసం కార్యక్రమాన్ని కుటుంబ సమస్యల పరిష్కారానికి వేదిక చేసుకోవద్దని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఫిర్యాదుదారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమంలో కలెక్టర్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగాలు కల్పించాలని, అన్నదమ్ములం ఘర్షణ పడ్డామని ఫిర్యాదులు చేస్తున్నారని ఇటువంటి ఫిర్యాదలు మాని ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకున్నా, ప్రభుత్వ పథకాలు దరిచేరకపోయినా ప్రజలు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
l జీలుగుమిల్లి మండలానికి చెందిన తెల్లం రత్తమ్మ తన పొలం తగాదా పరిష్కరించాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది దీనిపై స్పందించిన భాస్కర్ సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ అ«ధికారులను ఆదేశించారు.
l దేవరపల్లి మండలానికి చెందిన కాల అన్నపూర్ణ తన కుటుంబ సభ్యులెవరూ పట్టించుకోవడం లేదని, వృద్ధాప్యంలో కుమార్తెలు, కుమారులు వదిలేశారని కలెక్టర్ వద్ద వాపోయింది. వయోవృద్ధుల సంక్షేమశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ను సమస్య పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారు.
l దేవరపల్లికి చెందిన పిట్టా శ్రీనివాస్ స్థానిక బీసీ హాస్టల్ వార్డెన్ భర్త హాస్టల్‌లో ఆగడాలు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
l ఏలూరు తంగెళ్లమూడికి చెందిన చిట్టిబొమ్మ రామచంద్రమూర్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ స్థానిక ఆదివారపుపేటలో బస్‌షెల్టర్ ఇబ్బందిగా మారుతోందని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
l పెరవలి మండలం కానూరుకు చెందిన నిమ్మల రామకృష్ణ తమ గ్రామంలోని తాగునీటి చెరువు ఆక్రమణలకు గురవుతోందని, కలుషితమైన కారణంగా తాగునీటి సమస్య ఏర్పడిందని అధికారులకు చెప్పినా ఫలితం లేకుండా పోతుందని ఫిర్యాదు చేశారు.
l ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాత్రపు లోకేశ్వరరావు ఫిర్యాదు చేశారు.
సమస్యల పరిష్కారంపై దృష్టి సారించండి
ప్రజల నుంచి వచ్చే సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నిర్వహించిన అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మీ కోసం, మీ సేవల ద్వారా వచ్చే ఫిర్యాదులను నిర్ధిష్ట సమయానికి పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా అన్ని శాఖల్లోనూ కాగిత రహిత పరిపాలన అందించాలని, ఇ ఆఫీస్ విధానాన్ని అమలు చేసి తీరాల్సిందేనని కలెక్టర్ చెప్పారు. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పరిశీలించిన కలెక్టర్ పూర్తిస్థాయిలో హాజరు వేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డ్వామా పీడీ వెంకటరమణ, హౌసింగ్ పీడీ ఇ.శ్రీనివాసరావు, ఆర్‌డబ్లూఎస్ ఎస్‌ఈ అమరేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement