మమ్మల్ని పట్టించుకోవడం లేదు
సాక్షి, విజయవాడ : ‘దుర్గగుడి అధికారులు పనితీరు ఏ మాత్రం బాగాలేదు. తిరుమలలో ఎమ్మెల్యే లెటర్ హెడ్‌పై రోజుకు ఏడుగురు భక్తులను అనుమతిస్తున్నారు. దుర్గగుడిలో మాత్రం మా లెటర్స్‌ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మేము అధికార పార్టీలో ఉన్నామా... ప్రతిపక్షంలో ఉన్నామా.. మాకే అర్థం కావడం లేదు..’ అంటూ జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఇన్‌చార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యాన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, వల్లభనేని వంశీమోహన్, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ దుర్గగుడి అధికారులు ఏ మాత్రం ప్రొటోకాల్ పాటించడం లేదని, దీనివల్ల తాము కార్యకర్తల వద్ద పలుచనైపోతున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి పుల్లారావు వెంటనే స్పందించి దుర్గగుడి ఈవో ఎ.సూర్యకుమారిని పిలిపించేందుకు ప్రయత్నించగా.. ఆమె వెలగపూడిలోని సెక్రటేరియేట్‌లో ఉన్నట్లు తెలిసింది. దీంతో మంగళవారం దుర్గగుడి అధికారులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేస్తామని ఆయన చెప్పారు. నగరంలో బాణసంచా దుకాణాల ఏర్పాటు చేసుకునే వ్యాపారులకు అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మంత్రి దృష్టికి తెచ్చారు. దీన్ని సాధ్యమైనంత తర్వగా పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ వీరపాండ్యన్‌ను మంత్రి ప్రత్తిపాటి ఆదేశించారు.
రికార్డ్ డ్యాన్స్‌లకు అనుమతివ్వండి
గ్రామీణ ప్రాంతాల్లో సంబరాలు, ఉత్సవాల సమయంలో రికార్డింగ్ డాన్స్‌లకు అనుమతించాలని పలువురు ఎమ్మెల్యేలు కోరారు. అశ్లీలతకు తావులేకుండా డ్యాన్సులను అనుమతిస్తామని నగర పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ హామీ ఇచ్చారు. పెనమలూరు, పోరంకిలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చెప్పారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎం పోస్టులు భర్తీ చేసేటప్పుడు ముందుగా తమకు సమాచారం ఇవ్వాని ఎమ్మెల్యేలు మంత్రులను కోరారు. ఈ సమావేశంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, సబ్ కలెక్టర్ సుజన తదతరులు పాల్గొన్నారు.