అందరూ చూస్తుండగానే ఆత్మహత్య!
చిత్తూరు (అర్బన్) : చిత్తూరు రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఉదయం ప్రయాణికులందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి రెప్పపాటు వ్యవధిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వివరాలు..ఉదయం 9.30 గంటల సమయంలో చిత్తూరు రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్‌ఫాం నుంచి తిరుపతి వైపు నవయుగ ఎక్స్‌ప్రెస్ రైలు బయల్దేరింది. దేనికోసమో ఎదురుచూస్తున్నట్లు ప్లాట్‌ఫాం మధ్యలో బెంచీపై చాలాసేపటి నుంచి కూర్చున్న ఓ వ్యక్తి హఠాత్తుగా లేచాడు. అంతే! ఒక్క ఉదుటున లేచి రెండు బోగీల నడుమ ఉన్న గేప్‌లో రైలు పట్టాలపై తలపెట్టాడు. చక్రాలు మెడ మీదుగా వెళ్లడంతో తల, మొండెం వేరయ్యాయి.
క్షణాల వ్యవధిలో జరిగిన ఈ సంఘటనను చూసి ప్లాట్‌ఫాంలోని ఇతర ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుడు స్థానిక గిరింపేట బౌండువీధికి చెందిన ఎం.శరవణ (45) అని రైల్వే పోలీసులు గుర్తించారు. ఫొటో స్టూడియో నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఇతడు కుటుంబ, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు చంద్ర తెలిపారు. ఇదలా ఉంచితే, మృతుడి తల్లి గిరింపేట టీడీపీ కార్పొరేటర్‌గా పని చేస్తున్నారు.