పెళ్లి చెడగొట్టాడనే హత్య | friend mudered because of marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి చెడగొట్టాడనే హత్య

Published Thu, Jul 21 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

పెళ్లి చెడగొట్టాడనే హత్య

పెళ్లి చెడగొట్టాడనే హత్య

ముద్దాయి అరెస్టు
ఐ.పోలవరం : కేశనకుర్రు గ్రామంలో ఈనెల 13వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తనకు పెళ్లి సంబంధాలు రాకపోవడానికి కారకుడని భావించి ఒకప్పటి తన మిత్రుడిని హత్య చేశాడు. పాత ఇంజరం పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ ఎల్‌.అంకయ్య గురువారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. కేశనకుర్రు గ్రామ పరిధి పెద్ద చెరువు గట్టు ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు, అంగాడి సత్తిరాజు (26), చింతాప్రసాద్‌ స్నేహితులు. ఈ ముగ్గురూ చెడు అలవాట్లకు బానిసలయ్యారు. ఆ నేపథ్యంలో సత్తిరాజుకు వెంకటేశ్వర్లుకు మధ్య మనస్పర్థలు పెరి గాయి. 2011 నుంచి తనకు వచ్చిన పెళ్లి సంబంధాలు తప్పిపోడానికి సత్తిరాజే కారకుడని వెంకటేశ్వర్లు తెలుసుకున్నాడు. దాంతో అతనిపై కక్ష పెంచుకొని అతనిని చంపాలని సమయం కోసం వేచిచూస్తున్నాడు. చింతా ప్రసాద్‌కు పెళ్లికావడంతో అతను అత్తవారి ఊరైన గొర్రెపూడి వెళ్లిపోయాడు. ఈనెల 11వ తేదీన చింతా ప్రసాద్‌ ఊరిలోకి వచ్చాడు. అతన్ని కచ్చితంగా సత్తిరాజు కలుస్తాడని వెంకటేశ్వర్లు భావించాడు. అదే విధంగా ఈనెల 13వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో చింతా ప్రసాద్, అంగాడి సత్తిరాజు, పి. రాంబాబు గోదావరి ఒడ్డుకు వెళ్లారు. ఆవిషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు కత్తిలాంటి చాకుతో వారు ఉన్న ప్రదేశానికి వెళ్లాడు. నీతో మాట్లాడాలి రమ్మనమని సత్తిరాజును  పిలిచాడు. దానికి అతను తిరస్కరించడంతో తన వెంట తెచ్చుకున్న ఆయుధంతో అతని ఛాతిపై పొడిచాడు. గాయపడిన సత్తిరాజు పరుగుతీస్తూ గోదావరి గట్టు ఎక్కి అక్కడ పడిపోయాడు. స్థానికులు అతన్ని మోటారు సైకిల్‌పై తొలుత మురమళ్లలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి, అక్కడ నుంచి అమలాపురంలోని కిమ్స్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడకు వెళ్లేసరికి సత్తిరాజు చనిపోయాడు. డీఎస్పీ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేసిన సీఐ రమణరావు ఈనెల 20వ తేదీన వెంకటేశ్వర్లును అతని ఇంటి వద్ద అరెస్టు చేసి హత్యకు  ఉపయోగించిన కత్తిని స్వాధీనపరుచుకున్నారు. నిందితుడు చింతా వెంకటేశ్వర్లును గురువారం కోర్టుకు హాజరు పరిచారు. 
 
అవే కూరగాయాలు 
దిగిరామంటున్న ధరలు
వరదలకు నీటమునిగిన కూరగాయల పంటలు
వేసవిలో మండడం మొదలైన కూరగాయల రేట్లు నేటికీ ఆదిశలోనే కొనసాగుతున్నాయి. కొన్నింటి ధర స్వల్పంగా తగ్గినప్పటికీ మిగిలినవాటి రేట్లు పెరగడంతో జనం బెంబేలెత్తుతున్నారు. గోదావరి వరదలు మన ప్రాంతంలోని కూరగాయల పంటలను దెబ్బతీయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.
అమలాపురం :
వేసవి ఆరంభంలో చుక్కలనంటిన కూరగాయల ధరలు ఇప్పటికీ దిగి రావడం లేదు. వేసవి ఎండలకు మన ప్రాంతంలో పంటలు దెబ్బతినడంతో టమాటా, బీన్స్‌ గింజలు, చిక్కుడు కాయల ధరలు విపరీతంగా పెరిగాయి. గత నెల నుంచి ఇతర ప్రాంతాల్లో పంట కాలం పూర్తి కావస్తుండడంతో క్యాప్సికమ్, బంగాళాదుంప వంటి వాటి ధరలకు రెక్కలొచ్చాయి. వీటి ధరల తగ్గుతాయనుకుంటున్న సమయంలో గోదావరికి వరదలు రావడంతో కూరగాయ పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. దాంతో కూరగాయల ధరలు మళ్లీ పెరిగిపోయాయి. క్యాప్సికమ్‌ ధర కేజీ రూ.80 వరకు ఉంది. వారం రోజుల క్రితం దీని ధర రూ.90.  బీట్‌రూట్, క్యారెట్‌ ధరలు రూ.40 ఉండగా, అల్లం ధర రూ.60 వరకు ఉంది. బీన్స్‌కాయల ధర రూ.60, బంగాళాదుంప రూ.24 నుంచి రూ.26 వరకు ఉంది. టమాటా ధర గత నెలకన్నా తక్కువ అనిపిస్తున్నా ఇప్పటికీ కేజీ రూ.32 వరకు ఉండడం విశేషం. ఇవన్నీ దిగుమతి చేసుకొనేవే. బంగాళాదుంప కోల్‌కతా నుంచి, మిగిలిన కాయగూరలు బెంగళూరు, చిత్తూరుల నుంచి దిగుమతి అవుతున్నాయి. అక్కడ పంట కాలం పూర్తి కావస్తుండడం, ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలతో కొంత పంట దెబ్బతినడం, ఎగుమతులకు అనువైన వాతావరణం లేకపోవడంతో ధరలు అనూహ్యంగా పెరిగాయి. గత వారంతో పోల్చుకుంటే వీటి ధరలు స్వల్పంగా తగ్గినా సాధారణ స్థాయికి వీటి వచ్చే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. 
ముంచిన వరదలు 
గోదావరికి వచ్చిన వరదలు కూరగాయ రైతులను ఎక్కువగా నష్టపరిచాయి. ఆలమూరు, కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, పి.గన్నవరం, అయినవిల్లి, మామిడికుదురు మండలాల్లోని లంక గ్రామాల్లో వేలాది ఎకరాల్లో కూరగాయ పంటలు సాగవుతుంటాయి. చిక్కుడు, గోరుచిక్కుడు, ఆనప, దొండ, బీర, పొట్ల, కాకరకాయ వంటి పందిరి కూరగాయలు, బెండ, టమాట, వంగ వంటి కాయగూరలతోపాటు తోటకూర, గోంగూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరల సాగు ఎక్కువ. ముఖ్యంగా ఆలమూరు, పి.గన్నవరం, అయినవిల్లిలో విస్తృతంగా వీటిని సాగు చేస్తుంటారు. గోదావరి వరదల ప్రభావం ఈ మండలాలపైనే ఎక్కువగా ఉంది. ఉద్యానశాఖ అంచనా ప్రకారం 2,928 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. అయితే వాస్తవంగా ఇంకా ఎక్కువ ఉంటుందని అంచనా. ఈ ప్రభావంతో స్థానికంగా పండే ఈ రకం కూరగాయల ధరలు మళ్లీ పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇది వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement