‘డబుల్’ స్థలాలు అప్పగించండి:కేటీఆర్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో నిర్మించబోయే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు అవసరమైన, ఇప్పటికే గుర్తించిన వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్థలాల్ని సంబంధిత శాఖలు వెంటనే జీహెచ్‌ఎంసీకి అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా మునిసిపల్ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై జీహెచ్‌ఎంసీ, తదితర శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వీలైనంత త్వరితంగా స్థలాలను జీహెచ్‌ఎంసీకి అప్పగించాలని, అదుకు కలెక్టర్లు, జేసీలు చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ జంక్షన్లను విస్తరించేందుకు అవసరమైన స్థలాలను సైతం వెంటనే అప్పగించాలన్నారు.
మరో 32 బస్తీల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు..
ఇప్పటికే మంజూరైన ఇళ్లు కాక మరో 32 బస్తీల్లో 15,519 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.