అబ్బురం
♦ నాడు నమ్మలేదు.. నేడు నమ్మాను
♦ సిద్దిపేట ప్రగతి భేష్ ఇబ్రహీంపూర్ ఆదర్శం
♦ గవర్నర్ కితాబు సుదీర్ఘ పర్యటన
సిద్దిపేట జోన్: ‘ఇబ్రహీంపూర్‌లో ఒకే రోజు లక్ష మొక్కలను నాటినట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పినప్పుడు నమ్మలేదు. చిన్న గ్రామం భారీ లక్ష్యాన్ని, రోల్ మోడల్‌గా నిలువడాన్ని చూడాలనే ఆసక్తి కలిగింది. వెంటనే గ్రామానికి రావాలనుకున్న. వచ్చి గ్రామం మొత్తం పరిశీలించా. ఇప్పుడు సంతృప్తిగా ఉంది. ప్రజల సమష్టి భాగస్వామ్యంతో ఎదైనా సాధించవచ్చన్న నమ్మకం కలిగింది. ఇందుకు ఇబ్రహీంపూర్ ప్రగతే నిదర్శనం’ అని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కితాబిచ్చారు. శుక్రవారం సిద్దిపేటలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను మంత్రి హరీశ్‌రావు ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఇదే క్రమంలో ఆయన ప్రతి పథకాన్ని, ఆదర్శంగా నిలిచిన వినూత్న ప్రయోగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సిద్దిపేట నియోజకవర్గం రోల్‌మోడల్‌గా నిలువడంపై సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్‌రావు చేస్తున్న అభివృద్ధిని చూసి ఆయన ప్రసంశించారు. సిద్దిపేట ప్రయోగశాలగా రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలిచిందని ఇబ్రహీంపూర్ ఇంకుడు గుంతలు, కందకాలు, హరితహారం, దోమలు లేని గ్రామం, సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు, వైద్య రంగ సంస్కరణల్లో భాగంగా కంగారు మెథడ్ యూనిట్ లాంటి అధునాతన పథకాలను చూసి గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారు.