రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
Published Wed, Sep 21 2016 11:18 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
– వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
పత్తికొండ టౌన్: రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. రైతుభరోసా యాత్రలో భాగంగా ఈనెల 28వ తేదీ నుంచి ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి తుగ్గలి, పత్తికొండ మండలాల్లో పార్టీనాయకులతో కలసి రూట్‌మ్యాప్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ.. 2014–15, 2015–16 సంవత్సారాల్లో కరువు మండలాలు ప్రకటించినా రైతులకు మాత్రం ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయలేదన్నారు. పక్కనే ఉన్న అనంతపురం జిల్లాలోని రైతులకు పరిహారం అందగా కర్నూలు జిల్లా రైతులపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు. వైఎస్సార్ హయాంలో కరువు మండలాల రైతుల బ్యాంకు ఖాతాలకు పరిహారం జమ అయ్యేదని గుర్తుచేశారు.
హంద్రీనీవా సాగునీటి ప్రాజెక్టుకు వైఎస్ హయాంలోనే అధికశాతం నిధులు కేటాయించారని, అప్పట్లోనే 70శాతం పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులు పూర్తిచేయడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్ చలవతో చేపట్టిన ప్రాజెక్టులను తమ గొప్పతనంగా చెప్పుకోవడానికి టీడీపీ నాయకులకు సిగ్గులేదా అని ఎద్దేవా చేశారు. సమావేశంలో ఉప్పర్లపల్లి సింగిల్‌విండో అధ్యక్షుడు ప్రహ్లాదరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు శ్రీరంగడు, ఎర్రగుడి రామచంద్రారెడ్డి, పత్తికొండ, తుగ్గలి మండలాల కన్వీనర్లు జూటూరు బజారప్ప, జిట్టా నాగేష్ పాల్గొన్నారు.
Advertisement