కరీంనగర్ అతలాకుతలం
ఎడతెరిపి లేని వానతో వణికిన పట్టణం
కుంగిన కల్వర్టులు.. కొట్టుకుపోయిన రోడ్లు
పట్టణంలో 17.4 సెం.మీ. వర్షపాతం నమోదు
ఐదేళ్లలో ఇదే అత్యధికం.. డ్రైనేజీలో పడి ఒకరి మృతి
ఖమ్మం జిల్లాలోనూ భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
కరీంనగర్/ఖమ్మం/ హైదరాబాద్ : కరీంనగర్, ఖమ్మం జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. కరీంనగర్ పట్టణంలో గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో భారీ వర్షపాతం నమోదైంది. ఇక్కడ అత్యధికంగా 17.4 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, ఈ జిల్లాలోని తిమ్మాపూర్, మానకొండూర్ మండలాల్లో 10 సెం.మీ. చొప్పున నమోదైంది. వర్షానికి ఓ వ్యక్తి డ్రైనేజీలో పడి కొట్టుకుపోయాడు. అలాగే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 7.82 సెం.మీ. మేర వర్షపాతం నమోదైంది. ఇక, హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసింది. వరంగల్, మెదక్ జిల్లాలలో తేలికపాటి జల్లులు పడ్డాయి. మరో రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
చిగురుటాకులా వణికిన కరీంనగర్
రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన.. ఆదివారం ఉగ్రరూపం దాల్చింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ముంచెత్తిన వానతో కరీంనగర్ పట్టణం చిగురుటాకులా వణికింది. డ్రైనేజీలు పొంగాయి. పలుచోట్ల కల్వర్టులు కూలాయి. కొత్తగా వేసిన రోడ్లు సైతం నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయి. కొత్తపల్లిలోని ప్రధాన రహదారి వర్షం ధాటికి పూర్తిగా దెబ్బతింది. లోతట్టు ప్రాంతాల్లోని వందలాది ఇళ్లలోకి నీళ్లు చేరడంతో పలువురికి రాత్రంతా కంటిపై కునుకు కరువైంది. మరోవైపు శనివారం రాత్రి కురిసిన వర్షానికి పట్టణంలోని 2వ డివిజన్ సుభాష్‌నగర్‌కు చెందిన బిట్ల పవన్ (55) డ్రైనేజీలో పడి శవమై తేలాడు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న ఈద్గా గోడ వర్షం ధాటికి సుమారు 10 మీటర్ల పొడవునా కూలిపోయింది.19వ డివిజన్‌లో పెద్ద డ్రైనేజీ ఒక వైపునకు కూలింది. గణేశ్‌నగర్‌లో స్టేడియం ముందు ఉన్న కల్వర్టు ఏకంగా డ్రైనేజీలో కూరుకుపోయింది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి.
పట్టణంలోనే అత్యధిక వర్షపాతం..
జిల్లా వ్యాప్తంగా 4.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే.. కరీంనగర్ పట్టణంలో ఏకంగా 17.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత ఐదేళ్లలో ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తిమ్మాపూర్, మానకొండూరు మండలాల్లోనూ 10 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. కమలాపూర్, ఎల్కతుర్తి, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, గొల్లపల్లి, పెగడపల్లి, మల్యాల, వేములవాడ, పెద్దపల్లి, ఎలిగేడు, కమాన్‌పూర్, మల్హర్ మండలాల్లో 5 నుంచి 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్ వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించారు. బాధితుల్ని ఆదుకుంటామని తెలిపారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు పడొచ్చనే వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో.. జిల్లాలోని లోతట్టు, గోదావరి తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 7.82 సెం.మీ..
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఖమ్మం జిల్లాలో శనివారం మొదలైన వర్షాలు ఆదివారం నాటికి తీవ్రరూపం దాల్చాయి. ఆదివారం జిల్లాలోని ఎర్రుపాలెం, బోనకల్లు, ఇల్లెందు మినహా అన్నిచోట్లా వర్షం పడింది. అత్యధికంగా సత్తుపల్లి మండలంలో 7.82 సెం.మీ. మేర వర్షపాతం నమోదైంది. కాగా, ఈ వర్షాలతో ప్రస్తుత ఖరీఫ్ పంటలకు మరింత మేలు జరుగుతుందని అధికారులు అంటున్నారు.
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం..
అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లో ఆదివారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మల్కాజ్‌గిరిలో అత్యధికంగా 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్లాపూర్, నాచారం తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాగల 24 గంటల్లో నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్‌లో నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి.
ప్రాంతం వర్షపాతం(సెం.మీల్లో)
మల్కాజ్‌గిరి 2.3
అంబర్‌పేట్ 2.2
ఉప్పల్ 2.2
సికింద్రాబాద్ 1.6
వెస్ట్‌మారేడ్‌పల్లి 2.2
తిరుమలగిరి 2
బొల్లారం 1.2
సైదాబాద్ 1.9
చిలకలగూడా 1.7
నారాయణగూడా 1.2