భార్య మరొకరితో ఉండటం చూసి..
ములకలచెరువు (చిత్తూరు) : భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతుందని తెలుసుకున్న భర్త గత కొన్ని రోజులుగా ఆమెతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసి కోపోద్రిక్తుడై వేటకొడవలితో ఇద్దిరినీ నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం కదిరినాయినికోట గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దంపతులు వెంకటరమణ, అరుణ(32) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఆదినారాయణ(39) కూడా కూలి పనులకు వెళ్తుంటాడు. ఈక్రమంలో ఆదినారాయణ అరుణతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఇది తెలిసిన వెంకటరమణ పలుమార్లు భార్యను హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో.. మనస్తాపానికి గురై తరచూ ఆమెతో గొడవ పడుతుండేవాడు. కాగా ఆదివారం ఉదయం భర్త ఇంట్లో లేని విషయాన్ని గుర్తించిన అరుణ ఆదినారాయణను కలవడానికి వెళ్లింది. ఇది తెలుసుకున్న వెంకటరమణ వేట కొడవలిని వెంట తీసుకొని వాళ్లను అనుసరిస్తూ వెళ్లాడు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో వేట కొడవలితో ఆమె మెడ మీద వేటు వేయడంతో.. అరుణ అక్కడికక్కడే మృతిచెందగా, అక్కడి నుంచి పారిపోయిన ఆదినారాయణను వెంటాడి నడి రోడ్డుపై నరికి చంపేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.