జాతీయ బ్యాడ్మింటన్ క్రీడలకు చేయూత
జిల్లా కలెక్టర్ కె.వి. సత్యనారాయణ
కడప స్పోర్ట్స్ :
జిల్లాను క్రీడాహబ్‌గా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ కె.వి. సత్యనారాయణ అన్నారు. ఆదివారం కడప నగరంలోని వైఎస్‌ఆర్ ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి సబ్‌జూనియర్ బాలబాలికల బ్యాడ్మింటన్ పోటీలు, ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను క్రీడల్లో అన్ని రంగాల్లో ముందుంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని డీఎస్‌ఏ అధికారులకు సూచించారు. అదే విధంగా నవంబర్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి బ్యాడ్మింటన్ సీనియర్ ర్యాంకింగ్ పోటీలకు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. జాతీయస్థాయి పోటీలు నిర్వహించడం ద్వారా కడప ఖ్యాతి దేశవ్యాప్తమవుతుందన్నారు. కార్పొరేట్ సంస్థలు ఇటువంటి పోటీలకు ఆర్థిక చేయూతనివ్వాలని కోరారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తే అంతర్జాతీయస్థాయిలో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. బాగా చదవడంతో పాటు బాగా సాధన చేసి క్రీడల్లో రాణించాలని సూచించారు. కోచ్‌ల కొరత అధిగమించేందుకు వెంటనే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్ మాట్లాడుతూ క్రీడలకు చక్కటి సహకారం అందించే కలెక్టర్ మనకు లభించడం సంతోషకరమన్నారు. క్రీడల అభివృద్ధికి సంబంధించి యాక్షన్‌ప్లాన్ ఇప్పటికే రూపొందించామన్నారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి జిలానీబాషా మాట్లాడుతూ ఈ నవంబర్‌లో జాతీయస్థాయి ర్యాంకింగ్ సీనియర్ ఛాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించేందుకు బ్యాడ్మింటన్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చిందన్నారు. జిల్లా అధికారులు, దాతలు సహకారం అందించాలని కోరారు. అదే విధంగా జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు అండర13 విభాగం వారిఇక కష్ణాజిల్లా ఉయ్యూరులోను, అండర్–15 విభాగం వారికి గుంటూరు జిల్లా తెనాలిలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇన్‌చార్జి డీఎస్‌డీఓ గౌస్‌బాషా మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో చక్కగా రాణించి జిల్లా ఖ్యాతిని చాటిచెప్పాలని ఆకాంక్షించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో బ్యాడ్మింటన్ క్రీడ ఎక్కడ నిర్వహించినా అధిక సంఖ్యలో కడపక్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తుండటం జిల్లాలో క్రీడకు ఉన్న ఆదరణను తెలియజేస్తుందన్నారు. అనంతరం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమై జాతీయస్థాయి పోటీలను విజయవంతం చేసేందుకు ప్రణాళిక సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కోశాధికారి నాగరాజు, ఉపాధ్యక్షులు బాలగొండ గంగాధర్, మునికుమార్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి రెడ్డిప్రసాద్, భరత్‌రెడ్డి, సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.