టీటీడీలో అక్రమాల దందా | irregularities Danda in ttd | Sakshi
Sakshi News home page

టీటీడీలో అక్రమాల దందా

Published Tue, Mar 14 2017 12:58 AM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM

టీటీడీలో అక్రమాల దందా - Sakshi

టీటీడీలో అక్రమాల దందా

2012లో రూ.300 జెరాక్స్‌ టికెట్ల విక్రయం
సంస్థకు రూ.2 కోట్ల నష్టం
2015లో దాతలకిచ్చే లడ్డూల కుంభకోణం
ఆ విభాగం ఉద్యోగే పాత్రధారుడు
తాజాగా నకిలీ వీఐపీ టికెట్లతో దందా


‘ధర్మోరక్షతి రక్షితః’ ఇదీ టీటీడీ నినాదం. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అనేది దాని అర్థం. ప్రస్తుతం టీటీడీలో ధర్మం అనేది చూద్దామన్నా కనిపించడం లేదు.  అధర్మమే రాజ్యమేలుతోంది. టీటీడీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసే ఉద్యోగులే అక్రమాలకు పాల్పడుతూ సంస్థ పరువును బజారుకీడుస్తున్నారు.

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ను కుంభకోణాలు వెంటాడుతున్నాయి. 2012లో రూ.300 జెరాక్స్‌ టికెట్ల విక్రయంతో భారీ నష్టం వాటిల్లింది. దాదాపు రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. 2015లో దాతల విభాగంలో ఓ ఉద్యోగి దాతలకు ఇవ్వాల్సిన లడ్డూలు 60వేల వరకు బొక్కేశాడు. తాజాగా ఇదే విభాగం ద్వారా కేటాయించే వీఐపీ టికెట్లను అక్రమార్కులు కొందరు నకిలీతో విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నారు.

దాతల పేర్లతో నకిలీ వీఐపీ టికెట్లతో అక్రమ దందా
టీటీడీకి రూ.10 లక్షలు, ఆపైన విరాళాలు ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు కేటాయిస్తారు. వీటి ద్వారా దాతలు సులువుగా శ్రీవారిని దర్శించుకుంటారు. కొందరు అక్రమార్కులు దొడ్డిదారిన నకిలీ టికెట్ల తయారీకి శ్రీకారం చుట్టారు. టీటీడీ దాతల విభాగం టికెట్ల తరహాలోనే నకిలీవి తయారు చేశారు. వాటిని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. శనివారం అలాంటి టికెట్లు స్కానింగ్‌ కాకపోవడంతో అక్రమాలు వెలుగుచూశాయి. ఈ దందాలో నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.

2012లో రూ.300 జెరాక్స్‌ టికెట్లతో టీటీడీకి రూ.2 కోట్ల నష్టం
2015 ముందు వరకు రూ.300 టికెట్లను శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ముందు క్యూలో కేటాయించే వారు. ఈ విధానంలోనే 2012లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. కంప్యూటర్‌ ప్రింటర్‌లో టికెట్ల ముద్రణ వెనుకే కార్బన్‌ పేపరు సాయంతో మరో నకిలీ టికెట్టును తీసేవారు. ఆ టికెట్టును ఇతర భక్తులకు కౌంటర్‌ ద్వారానే ఎలాంటి అనుమానం రాకుండా విక్రయిస్తూ సొమ్ము చేసుకునేవారు. టికెట్లు ఇచ్చే నలుగురు కాంట్రాక్టు సిబ్బంది నిందితులుగా తేల్చారు. వారిపై సెక్షన్‌ 420 (మోసం), 468 (ఫోర్జరీ), 120బీ (కుట్ర) కింద కేసు నమోదు చేశారు. రూ.60 లక్షల వరకు మోసం జరిగినట్టు తేల్చారు. వాస్తవానికి రూ.2 కోట్ల పైబడి టీటీడీకి నష్టం వాటిల్లింది.

డోనార్‌ మేనేజ్‌మెంట్‌ æసిస్టంతో అక్రమాలకు చెక్‌
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యాలు, ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవలో భాగంగా విద్య, వైద్య సేవల విస్తరణ కోసం టీటీడీ 9 ట్రస్టులు, ఒక స్కీం నిర్వహిస్తోంది. శ్రీవారి నిత్యాన్న ప్రసాదం ట్రస్టు కోసం రూ.800 కోట్ల వరకు భక్తులు విరాళాలు ఇచ్చారు. మిగిలిన ట్రస్టుల్లో మరో రూ.వెయ్యి కోట్ల వరకు విరాళాలున్నాయి. రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు విరాళాలు ఇచ్చిన దాతలు 46 వేల మంది వరకు ఉన్నారు. రూ.కోటిపైబడి ఇచ్చిన దాతలు 130 మంది ఉన్నారు. ఇందులో రూ.లక్ష నుంచి ఆపైడి విరాళాలు ఇచ్చే దాతలకు తిరుమలలో గది, శ్రీవారి దర్శనం ఉచితంగా కల్పిస్తారు. ఇదే విభాగంలో లడ్డూల స్కాం బయటపడటంతో ఆ విభాగాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌ చేసి, పారదర్శకత పెంచాలని టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు సంకల్పించారు. ఆ మేరకు గత ఏడాది సెప్టెంబర్‌లో డోనార్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా దాతల రికార్డులను ఆన్‌లైన్‌ చేశారు. దీనిద్వారా దాతలందరికీ ఆన్‌లైన్‌ పాస్‌బుక్‌ ఇంటర్నెట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ సౌకర్యం కల్పించారు. భక్తులు తిరుమలకు వచ్చే సమయంలో శ్రీవారి దర్శనం, బస కూడా ముందుస్తుగానే పొందే సౌకర్యం కల్పించారు.

2015లో దాతల విభాగంలో 60 వేల లడ్డూలు బొక్కిన అటెండర్‌
శ్రీవారి ట్రస్టులకు విరాళాలు ఇచ్చిన దాతలకు లడ్డూ ప్రసాదాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. అలా దాతల పేరుతో మొత్తం 60 వేల లడ్డూలు గల్లంతైనట్టు తేల్చారు. ఈ అక్రమ దందాలో రూ.15లక్షలు నష్టం వాటిల్లిందని, అదే విభాగంలో పనిచేసే ఓ అటెండర్‌ పాత్ర ఉన్నట్టు తేల్చారు. ఆ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. ఆ తర్వాతే దాతల విభాగం పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement