దారుణం.. తల్లీ కూతుళ్ల హత్య | mother and daughters murdered in tadipatri | Sakshi
Sakshi News home page

దారుణం.. తల్లీ కూతుళ్ల హత్య

Published Tue, Jul 4 2017 10:47 PM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

దారుణం.. తల్లీ కూతుళ్ల హత్య

దారుణం.. తల్లీ కూతుళ్ల హత్య

సుత్తితో దాడి చేసిన వైనం
ఘటనా స్థలంలో కనిపించని భర్త
నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తాం : ఎస్పీ


తాడిపత్రి పట్టణంలో దారుణం జరిగింది. తల్లిని, ఇద్దరు కూతుళ్లను అతికిరాతకంగా సుత్తితో దాడిచేసి హతమార్చారు. అనంతరం సుత్తిని కాల్చివేసి వెళ్లారు. ఒకే ఇంట్లో ముగ్గురు హత్యకు గురికావడం కలకలం రేపింది. హత్యకు కుటుంబ కలహాలు దారితీశాయా.. లేక ఇంకేమైనా ఉన్నాయా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

తాడిపత్రి టౌన్/రూరల్ : ముగ్గురి హత్యతో తాడిపత్రి ఉలిక్కిపడింది. మంగళవారం ఉదయం తల్లీకూతుళ్లు హత్యకు గురయ్యారు. హతుల బంధువులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్‌ జిల్లా కొండాపురం మండలం కోడూరుకు చెందిన రామసుబ్బారెడ్డి వ్యవసాయం చేసుకుంటూ, ఫైనాన్స్‌ వ్యాపారం చేసుకునేవాడు. ఈయన మొదటి భార్య చనిపోవడంతో సులోచనమ్మ (48)ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరు నాలుగేళ్ల క్రితం తాడిపత్రికి వచ్చారు. పట్టణంలోని కృష్ణాపురం మూడో రోడ్డులో నివాసముంటున్నారు. వీరికి ప్రసన్న, ప్రత్యూష (22), సాయి ప్రతిభ (19) అనే  ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రసన్న తిరుపతిలో అగ్రికల్చర్‌ బీఎస్సీ, రెండవ కూమార్తె ప్రత్యూష అక్కడే ఎమ్మెస్సీ, సాయి ప్రతిభ బీటెక్‌ చదువుతున్నారు. ప్రత్యూష, సాయి ప్రతిభలు కళాశాలలకు సెలవులు కావడంతో తాడిపత్రిలోని ఇంటికి వచ్చారు.

తెల్లవారుజామున హాహాకారాలు..
రామసుబ్బారెడ్డి ఇంటి నుంచి మంగళవారం తెల్లవారుజామున హాహాకారాలు వినిపించాయి. చుట్టుపక్కల వారు వెళ్లి చూసే సమయానికి సులోచనమ్మ, సాయి ప్రతిభ విగతజీవులై పడి ఉన్నారు. ప్రత్యూష కొన ఊపిరితో ఉండటంతో 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రత్యూష చికిత్స పొందుతూ మృతి చెందింది.

సుత్తితో మోది అంతమొందించారు..
తల్లీకూతుళ్ల తల, శరీరంపై దుండగులు సుత్తితో మోది అంతమొందించారు. అనంతరం ఇంటి వెనుక వైపున సుత్తిని, దానికి ఉన్న కట్టెను కాల్చేసి వెళ్లారు. ఘటన అనంతరం రామసుబ్బారెడ్డి కనిసించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ, రూరల్‌ సీఐలు భాస్కర్‌రెడ్డి, సురేంద్రనాథరెడ్డి, ఎస్‌ఐలు ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి ఘటన స్థలానికి చేరుకుని, పరిస్థితి సమీక్షించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బంధుల రోదనలతో ఆస్పత్రి ఆవరణం దద్దరిల్లింది.

బావే హతమార్చాడు!
అక్కను, ఇద్దరు మేనకోడళ్లను బావ రామసుబ్బారెడ్డి హత్య చేసి ఉంటాడని హతురాలు సులోచనమ్మ సోదరుడు నాగేశ్వరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామసుబ్బారెడ్డి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడని, బంగారు, పొలం తాకట్టు పెట్టాలని ఒత్తిడి తీసుకురాగా అక్కా, పిల్లలు ఒప్పుకోలేదన్నాడు. అందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని తెలిపాడు.
- సులోచనమ్మ సోదరుడు నాగేశ్వరరెడ్డి

హత్యాస్థలిని పరిశీలించిన ఎస్పీ
తల్లీ కూతుళ్ల హత్య సమాచారం తెలుసుకున్న ఎస్పీ జి.వి.జి.అశోక్‌కుమార్‌ హుటాహుటిన తాడిపత్రికి చేరుకున్నారు. తొలుత ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలను పరిశీలించారు. హతుల కుటుంబసభ్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి హత్య జరిగిన ఇంటిని పరిశీలించి, హత్యకు దారితీసిన కారణాలపై సీఐ భాస్కర్‌రెడ్డిని విచారించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. నిందితులను గుర్తించి త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. హతుల కుటుంబసభ్యులు రామసుబ్బారెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేశారని, దీనిపై విచారణ చేస్తున్నామని చెప్పారు.

కుటుంబ సభ్యులకు పరామర్శ
ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలను రాజకీయ పార్టీల నాయకులు సందర్శించి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ పేరం నాగిరెడ్డి తదితరులు పరామర్శించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement