ఉద్యమ వీరులకువీడని సంకెళ్లు!
♦ ఎత్తివేయని కేసులు.. కోర్టుల చుట్టూ చక్కర్లు
♦ తెలంగాణ ఉద్యమకారులకు తీరని మనోవేదన
♦ కొందరిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ
జిల్లాలో నమోదైన 63 కేసుల్లో 59 రద్దు చేసిన ప్రభుత్వం మూడింటిని ఇప్పటికీ ఎత్తివేయలేదు. వాటిని రద్దు చేయాలంటూ ఉద్యమకారులు టీఆర్‌ఎస్ అధినాయకత్వం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపో యింది. కొన్నాళ్లపాటు కోర్టుకు హాజరుకాని వారికి ఈ మధ్య నాన్ బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి.
నాతోపాటు పది మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి మంత్రి వర్గ సమావేశంలో ఉద్యమకారులపై నమోదైన అన్ని కేసులను ఎత్తివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ జిల్లాలో ఇంకా కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. కేసులు ఎత్తివేశారని భావించి కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. - శుభప్రద్‌పటేల్, టీఆర్‌ఎస్ నేత
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా.. ఉద్యమమే ఊపిరిగా.. నిప్పు కణికలా పనిచేసిన ఉద్యమవీరులను కేసుల సంకెళ్లు వీడడంలేదు. సకల జనుల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి రెండేళ్లయినా వారికి కేసుల నుంచి విముక్తి కలగలేదు. అధికార ం లోకి వచ్చిన మరుక్షణమే బేషరతుగా కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో మాత్రం విఫలమవుతోంది. దీంతో అరెస్టులు, వారెంట్లతో మానసిక క్షోభ అనుభవిస్తున్న ఉద్యమకారులకు తీరని మనోవేదన మిగులుతోంది. జిల్లావ్యాప్తంగా నమోదైన 63 కేసుల్లో 59 రద్దు చేసిన ప్రభుత్వం మూడింటిని మాత్రం ఇప్పటికీ ఎత్తివేయలేదు.
ఈ మూడు కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న 24 మంది తమపై పెట్టిన కేసులు రద్దు చేయమని నిత్యం సచివాలయంలోని మంత్రుల పేషీల చుట్టూ చక్కర్లు కొడుతున్నా ఫలితం కనిపించడంలేదు. ఈ కేసుల బాధితుల్లో వికారాబాద్‌కు చెందిన శుభప్రద్‌పటేల్ బృందం ఒకటి. ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమానికి టీఎస్‌జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా నాయకత్వం వహిం చిన పటేల్ సహా పలువురిపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 32 కేసులు నమోదయ్యాయి. గంగ్యాడలో అప్పటి కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డిపై కోడిగుడ్లు విసిరిన కేసుతోపాటు.. అప్పటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకున్న సంఘటనలోనూ ఆయనపై కేసులు నమోదయ్యాయి.
పరిగిలో చంద్రబాబు కాన్వాయ్‌పై దాడిచేసిన ఘటన.. అసెంబ్లీ ముట్టడి, సాగరహారం, మిలియన్ మార్చ్, ఖలేజా సినిమా షూటింగ్ సెట్టింగ్ దగ్ధం ఇలా అనేక ఘటనల్లో పటే ల్‌పై రకరకాల సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇలా తెలంగాణ ఉద్యమంతో ప్రభుత్వానికి కంట్లో నలుసులా మారిన శుభప్రద్‌పై అప్పటి సర్కారు.. ‘బీ’షీట్ తెరిచింది. తద్వారా అసాంఘిక శక్తిగా ముద్రవేస్తూ.. ఆయన కదలికలపై నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఏర్పడడంతో కేసులన్నీ మాఫీ అవుతాయని భావించిన పటేల్‌కు నిరాశే మిగిలింది. ఆయనతోపాటు మరో 24 మందిపై ఇంకా మూడు కేసులు రద్దు చేయకపోవడంతో ఉద్యోగాలు, పదవుల సాధన ప్రయత్నంలో ఉన్న ఆ నిరుద్యోగులకు ప్రతిబంధకంగా మారాయి.