మూడంటే మూడే!
మూడంటే మూడే!
Published Sat, Jul 23 2016 6:42 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
– ఎక్సైజ్ పోలీసులకు సొంత భవనాలు కరువు
– మూడు మినహా అన్నింటికీ అద్దె భవనాలే దిక్కు
– స్థలసేకరణకు సహకరించని రెవెన్యూశాఖ
– వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్న సిబ్బంది
ఆత్మకూరు రూరల్: నిరంతరం దాడులు, రోడ్డు చెకింగ్ విధుల్లో బిజీగా ఉండే ఎక్సైజ్ పోలీసులకు కాసేపు నింపాదిగా కూర్చుని విశ్రాంతి తీసుకుందామంటే కూడా వసతిలేని అద్దె భవనాలు అందుకు అనుకూలించడంలేదు. జిల్లాకు సంబంధించి 17 ఎక్సైజ్ స్టేషన్లుండగా కోసిగి, నంద్యాల, కర్నూలు మినహా మిగతా చోట్ల ఆ శాఖ సిబ్బంది ఇరుకుగా ఉన్న అద్దె గదుల్లోనే సర్ధుకుపోతున్నారు. జిల్లాలో సుమారు రెండు వేల మంది అధికారులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నా సరైన వసతులు, విశ్రాతి గదులు , బాతురూమ్‌లు లేని అద్దె గదుల్లో విధి నిర్వహణకు ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మకూరు స్టేషన్ 16 ఏళ్లుగా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. సర్కిల్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు ఎస్‌ఐలు, 17 మంది కానిస్టేబుళ్లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. నాటుసారాకు కుటీర పరిశ్రమగా కొనసాగుతున్న సిద్దాపురం, ఆత్మకూరు , కొత్తపల్లె, వెలుగోడు, శ్రీశైలం వంటి నల్లమల అటవీ ప్రాంత మండలాలు ఈ సర్కిల్ పరిధిలో ఉండడంతో స్థానిక ఎక్సైజ్ పోలీసులే కాకుండా జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించే ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు కూడా తరుచూ వస్తుంటారు. అయినా ఇక్కడి స్టేషన్‌కు వసతులతో కూడి సొంత భవనం లేకపోవడం గమనార్హం.
ఇరుకు సందులో చిన్న బాతురూం..
20 మంది సిబ్బంది పనిచేస్తున్న ఆత్మకూరు స్టేషన్‌కు ఇరుకు సందు చివరలో చిన్న పాటి బాతురూం ఉంది. పట్టుబడిన వాహనాలను కూడా ఈ చిన్నపాటి సందులోనే ఉంచడంతో బాత్‌రూంకు వెళ్లడం కూడా కష్టంగా ఉంది.
ఒకే హాల్‌లోనే అందరూ..
స్టేషన్ భవనం కింద, పైన ఉన్నప్పటికీ కింది పోర్షన్ పూర్తిగా సీజ్డ్ పాపర్టీతోనే నిండిపోయింది. మిగిలిన పై అంతస్థులోని ఒకే హాలును సీఐ, ఎస్‌ఐల ఛాంబర్‌గాను, కార్యాలయ సిబ్బంది కార్యాలయంగాను, నిందితులను కూర్చోబెట్టే లాకప్ రూం గాను వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. మహిళా సిబ్బందికి కనీసం యూనిఫాం మార్చుకోవడానికి కూడా ప్రత్యేక గదిలేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
స్థల కేటాయింపు కోసం ఎదురు చూపు..
అద్దె భవనాన్ని ఖాళీ చే యాలని యజమాని కోరుతున్నా ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిలో సొంత భవనం నిర్మించుకునే దిశగా అధికారులు స్థానిక రెవెన్యూ యంత్రాంగానికి స్థలం కేటాయింపుకోసం విజ్ఞాపనలు పంపారు. ఆత్మకూరు హైస్కూల్ గ్రౌండ్ చివరలో శిథిలంగా మారిన హాస్టల్ భవనాలున్న స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేసినా రెవెన్యూ అధికారులు స్పందించలేదు.
Advertisement
Advertisement