‘స్వరాజ్యం’పై పరాయి కన్ను!
♦ సువిశాల మైదానాన్ని చైనా కంపెనీలకు అప్పగించేందుకు పన్నాగం
♦ విజయవాడ నడిబొడ్డున అత్యంత విలువైన స్థలమిది..
సాక్షి, విజయవాడ బ్యూరో: ఎవరేమనుకున్నా ఫరవాలేదు అయిన వారికి దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్న టీడీపీ సర్కారు విజయవాడ నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన స్థలంపై తాజాగా దృష్టి సారించింది.సీఎం కార్యాలయానికి సమీపంలో, బందరు రోడ్డులో ఉన్న స్వరాజ్య మైదానాన్ని విదేశీ కార్పొరేట్ కంపెనీల చేతికి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ప్రాంతంలో గజం స్థలం విలువ రూ.2.5 లక్షలకు పైగా పలుకుతోంది. ఈ లెక్కన దాదాపు రూ.1,000 కోట్లు విలువ చేసే 7 ఎకరాల్లోని 33,880 గజాల స్థలాన్ని చైనా కంపెనీలకు కట్టబెట్టేందుకు శ్రీకారం చుట్టింది. వివిధ వర్గాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్న, స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరిలూదిన బెజవాడ నగర నడిబొడ్డున ఉన్న పీడబ్ల్యూడీ (నీటి పారుదల శాఖ స్థలం)గ్రౌండ్‌ను ఆదాయ వనరుగా మార్చడానికి సంకల్పించింది. పరాయి పాలన పోవాలని నినదించిన దేశభక్తుల కారణంగా స్వరాజ్య మైదానంగా ఘనతికెక్కిన ఏడెకరాల స్థలాన్ని మరో పరాయి దేశమైన చైనాలోని కంపెనీలకు కట్టబెట్టే యత్నం చివరి అంకానికి చేరుకుంది.
కార్యాలయాలు కనుమరుగు : ఎక్కడా జాగా లేదనే సాకుతో ఇరిగేషన్ కార్యాలయాన్ని తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్న ముఖ్యమంత్రి, దానికి సమీపంలోని నిర్మాణాలను తొలగించే పరిస్థితికి కారణమయ్యారు. సీఎంవో ఏర్పాటుతో అదనపు సౌకర్యాల పేరుతో, భద్రతాపరమైన కారణాలతో కార్యాలయాలన్నీ కనుమరుగవుతున్నాయి. సీఎంవో కోసం నీటిపారుదల శాఖ సముదాయంలోని అన్ని విభాగాలను బయటకు తరలించారు. ఇందుకోసం స్వరాజ్య మైదానంలో ఉన్న 13 పాత భవనాలను సుమారు రూ.50 లక్షలకుపైగా ఖర్చుచేసి ఆధునీకరించారు. ఆ భవనాల్లోకి ఇరిగేషన్ సర్కిల్‌లోని పలు విభాగాల కార్యాలయాలను తరలించారు. ఇప్పడు ఆ భవనాలను కూడా వేరే ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు.
ఇక్కడ 13 భవనాలను తొలగిస్తే నీటిపారుదల శాఖలోని పలు విభాగాల అధికారులు, సిబ్బంది ఎక్కడ ఉండాలనే సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. పెనమలూరులో 50 వేల చదరపు అడుగుల భవనాన్ని తీసుకుని అన్ని ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. వీటితోపాటు స్వరాజ్య మైదానానికి ఆనుకుని ఉన్న కృష్ణవేణి పాలిటెక్నిక్ కళాశాలకు అద్దెకు ఇచ్చిన నీటి పారుదల శాఖ భవనాన్ని కూడా ఖాళీ చేయించాలని నిర్ణయించారు. దానికి ఆనుకుని ఎకరా విస్తీర్ణంలో ఉన్న రైతు బజారును తొలగించి రైవస్ కాలువ గట్టున ఉన్న సాంబమూర్తి రోడ్డులో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
ఆదాయంపైనే దృష్టి
దశాబ్దాల కాలంగా ఎన్నో బహిరంగ సభలు, సమావేశాలు, ఎగ్జిబిషన్‌లు, బుక్ ఫెస్టివల్స్ వంటి విశేష చారిత్రక ఘట్టాలకు స్వరాజ్య మైదానం వేదికైంది. ఇక్కడ బహిరంగ సభల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి నేతలు గళమెత్తి జాతికి దిశానిర్దేశం చేశారు. ఖాళీ రోజుల్లో చిన్నారుల ఆటలకు, యువత క్రికెట్‌కు, కారు, బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇటువంటి మైదానాన్ని ఆదాయ వనరుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించడంపై పలు పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్ ఎ.బాబును కలిసి అభ్యంతరం తెలిపారు.
ఆదాయం వచ్చేలా ఈ మైదానాన్ని మార్పు చేయనున్నట్లు మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమావేశాల్లో కలెక్టర్ ప్రస్తావించడంతో అందరి అనుమానాలు నిజమయ్యాయి. గత నెలలో చైనాకు చెందిన కార్పొరేట్ కంపెనీల ప్రతినిధుల బృందం వచ్చి ఈ మైదానాన్ని పరిశీలించి వెళ్లింది.స్వరాజ్య మైదానంలో చేపట్టే నిర్మాణాల్లో కనీసం 20 వేల మందికి సరిపడే సమావేశ హాలును ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు సమాచారం. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు.మైదానంలోకి ఎవరూ రాకుండా రేకులతో ప్రహరీ నిర్మిస్తుండటం గమనార్హం.