చిలకలపూడి అ'నగ' నగా ...
చిలకలపూడి బంగారం పేరుతో అమ్మకాలు
వందేళ్లుగా నగల తయారీ
దేశ విదేశాల్లోనూ డిమాండ్
10 వేలకుపైగా కుటుంబాలకు ఉపాధి
రాజు ఇంట్లో ఫంక్షన్ రేపు..బంధువులతో ఇంటి లోగిలి కళకళలాడుతోంది.. రాజు భార్య మాత్రం ఒక మూల కూర్చొని మూతి మూడు వంకర్లు తిప్పుతోంది..రాజు పెదాలపై చిరునవ్వు కనిపిస్తున్నా..మనసులో ఆందోళన ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది.. భార్య అడిగిన నగలు తేవడానికి తగిన డబ్బు లేదు..ఏం చేద్దామా అని ఒకటే ఆలోచన..ఇంతలో తళుక్కుమంటూ ఐడియూ తట్టింది..వెంటనే చిలకలపూడి వెళ్లాడు..బడ్జెట్‌కు తగ్గట్టు..భార్యకు నప్పేట్టు నగలు తీసుకున్నాడు.. ఆ నగల ధగధగలతో ఫంక్షన్‌లో రాజు భార్య మిలమిల మెరిసిపోయింది..రాజు మనసు ఆనందంతో మురిసిపోయింది. ఇదీ చిలకలపూడి ఇమిటేషన్ జ్యూయలరీ ప్రత్యేకత..వనితలచే వందనమనిపించుకుంటూ..కళారంగంలో కాంతులీనుతూ..దేశ,విదేశాల్లో తళతళ మెరిసిపోతూ..వందేళ్లుగా వన్నెతగ్గని ఆదరణ చూరగొంటోందీ గిల్టు బంగా రం.దీని కథేంటో చూద్దాం మరి..
మచిలీపట్నం: బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో తక్కువ ఖర్చుతో బంగారు నగలనే ధరించిన అనుభూతిని పొందాలంటే రోల్డ్‌గోల్డ్ నగలను ఆశ్రయించాల్సిందే. అచ్చంగా బంగారు నగలను పోలినట్లుగా రోల్డ్‌గోల్డ్ తయారు చేసి ఆరు నెలలు, ఏడాది, రెండు, మూడు సంవత్సరాల గ్యారెంటీ ఇచ్చి విక్రరుున్నారు బందరు ప్రాంతంలో.
మారుతున్నఅభిరుచులకు అనుగుణంగా వేలాదిగా డిజైన్లు తయారు చేయటంలో నిపుణులున్నాలిక్కడ. అటు బంగారు నగల తయారీలోనూ, ఇటు చిలకలపూడి నగల తయారీలోనూ పేరుగడించారు. భరత నాట్యం, కూచిపూడి, కథకళి, ఒడిస్సీ తదితర నాట్యాల్లో కళాకారులు ఉపయోగించే అన్ని రకాల ఆభరణాలను ఇక్కడ తయారు చేస్తారు.
చిలకలపూడి బంగారు నగల తయారీలో బందరులో దాదాపు 10 వేల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ తయారైన నగలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర ప్రాంతాలకు ఎగుమతి అవుతారుు. విదేశాల్లో ఈ బంగారానికి ఆదరణ ఉంది.
ఆభరణాల తయారీ ఇలా..
సుమారు వందేళ్ల క్రితం రోల్టుగోల్డు వస్తువుల తయారీ బందరులోని చిలకలపూడిలో ప్రారంభమైంది. తొలుత కాపర్(రాగి) ఇత్తడి, జింక్ మెటిరియల్‌ను కలిపి మెటీరియల్‌ను తయారు చేస్తారు. ఇందులో రాగి శాతం అధికంగా ఉంటుంది. దీనిని ఇనుపరాడ్ల మాదిరిగా మార్చి పిడకల మధ్య కాలుస్తారు. ఈ మెటీరియల్‌కు సాగే గుణం వచ్చేందుకు కాల్చి గాలిలోనే ఆరబెట్టి కఠినత్వాన్ని తగ్గిస్తారు.
ఈ రాడ్లను ప్రత్యేక యంత్రాల ద్వారా రేకులుగాను, సన్నటి తీగలుగాను తీస్తారు. వీటిని నగల తయారీకి ఉపయోగిస్తారు. గతంలో గోల్డ్ కవరింగ్‌లో నగ ల తయారీకి ఉపయోగించే తీగలోనే బంగారం కలిపేవారు. తయూరైన డిజైన్లను తొలుత సల్ఫ్యూరిక్ యాసిడ్, అనంతరం నైట్రిక్ యాసిడ్‌లో కడుగుతారు.
నగలకు పూర్తి స్థాయిలో మెరుపు వచ్చేందుకు బంగారు కోటింగ్‌కు ఉపయోగించే పౌడరుతో కలిపిన ద్రావకంలో ముంచి తీస్తారు. వీటిని రంపపు పొట్టులో ఉంచి కలియతిప్పుతారు. దీంతో గోల్డ్ ప్లేటింగ్ వేసిన నగలు మరింత మెరుపును సంతరించుకుంటాయి.
గ్యారంటీతో అమ్మకం
చిలకలపూడి నగల గోల్డ్ కోటింగ్‌కు ఏడాది గ్యారంటీ ఉంటుంది. జాగ్రత్తగా వాడుకుంటే మరో ఆరు నెలలపాటు కోటింగ్ పోదు. మరింత ధర పెడితే రెండు, మూడు సంవత్సరాల వరకు గ్యారంటీతో నగలు లభిస్తాయి. చెవి దిద్దులు రూ. 20ల నుంచి దొరుకుతారుు. రంగురాళ్లు పొదిగిన నెక్లెస్‌లు, గొలుసులు రూ. 250లకు లభిస్తాయి. గాజుల రాళ్లు పొదిగినవి రూ. 100 నుంచి రూ. 250లకు లభిస్తాయి. జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప ఇవి చిలకలపూడిలో తయూరు చేసినట్లు గుర్తించలేం. వీటిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రత్యేక ఏజెన్సీలు ఉన్నాయి.
ఈ నగలకు డిమాండ్
ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డిజైన్లు మారుతుంటాయి. మార్కెట్‌లోకి వచ్చిన నూతన డిజైన్ల వైపే మహిళలు మక్కువ చూపుతుంటారు. రోల్డ్‌గోల్డ్ నగల్లో గాజులు, వడ్డాణాలు, చెవి దిద్దులు, నెక్లెస్‌లు, హారాలు, పాపిడిబిళ్లలు, జడగంటలు, దేవతా విగ్రహాలకు కిరీటాలు, హారాలు, గొలుసులు, వంకీలు, పట్టీలు, మాటీలను వేలాది డిజైన్లలో తయారు చేస్తారు.
పెళ్లి నగలు కొనేందుకు వచ్చాం
మధ్యతరగతి కుటుంబాల వారు బంగారంతో పెళ్లి నగలు చేయించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఫంక్షన్లు, పండుగలకు బంగారునగలు వేసుకుని వెళ్లాలంటే భయం. ఈ నేపథ్యంలోనే రోల్డ్‌గోల్డ్ నగలను కొనేందుకు వచ్చాం. ఈ నగలు తక్కువ ఖర్చుతో కొనుగోలు చేసినా అచ్చు బంగారాన్ని పోలి ఉంటాయి. జాగ్రత్తగా వాడుకుంటే ఎక్కువ కాలం మన్నుతాయి.
- రమాదేవి, గుడివాడ