రాష్ట్రంలో జాతీయ రహదారులకు రూ.50 వేల కోట్లు
♦ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
♦ కొత్తగా 3,092 కి.మీ. జాతీయ రహదారుల్ని నిర్మిస్తామని ప్రకటన
♦ రాష్ట్రప్రభుత్వం భూసేకరణ చేసి.. నివేదికతో ముందుకు రావాలి
♦ రూ.20 వేల కోట్లతో విజయవాడ చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు
♦ విజయవాడలో దుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన
సాక్షి, విజయవాడ: రాష్ర్టప్రభుత్వం భూసేకరణ చేసి, సమగ్రమైన నివేదిక (డీపీఆర్)తో ముందుకొస్తే.. రాష్ట్రంలో రూ.50,560 కోట్ల వ్యయంతో 3,092 కిలోమీటర్ల నూతన జాతీయ రహదారులను నిర్మిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, నౌకాయాన శాఖల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలో రూ.15 వేల కోట్లతో జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. జాతీయ రహదారులశాఖ, రాష్ర్ట రోడ్డు, భవనాల శాఖల సమన్వయంతో విజయవాడ సమీపంలో రూ.447.88 కోట్లతో దుర్గగుడి వద్ద తలపెట్టిన ఆరు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి, 5.122 కిలోమీటర్ల నాలుగులైన్ల రహదారి విస్తరణ పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు.
అలాగే ఇబ్రహీంపట్నం నుంచి చంద్రగూడెం వరకు గల ఎన్‌హెచ్ 30ని రెండు లైన్లతో పునర్నిర్మాణం, కత్తిపూడి నుంచి కాకినాడ బైపాస్ సెక్షన్ వరకు 26.15 కి.మీ. ఎన్‌హెచ్ 216ను నాలుగు లైన్లతో పునర్నిర్మాణం పనులకు, బెంజిసర్కిల్ వద్ద ఫ్లైఓవర్‌కు, విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో గడ్కరీ మాట్లాడుతూ.. విజయవాడ చుట్టూ 150 నుంచి 200 కి.మీ. వేగంతో వెళ్లేందుకు వీలుగా 180 కి.మీ. 8 లైన్ల ఔటర్ రింగ్ రోడ్డును రూ.20 వేల కోట్లతో నిర్మిస్తామని ప్రకటించారు. విజయవాడలో జాతీయ రహదారుల ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలో 30 శాతం డ్రైవింగ్ లెసైన్స్‌లు బోగస్‌వని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ డ్రైవింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు.
జలరవాణాను అభివృద్ధి చేస్తాం..
దేశంలో జలరవాణాను అభివృద్ధి చేస్తామని గడ్కరీ చెప్పారు. రోడ్డురవాణా ద్వారా సరుకు రవాణాకు రూపాయి ఖర్చయితే.. జలరవాణా ద్వారా 25 పైసలకే చేయవచ్చన్నారు. ఇప్పటికే కృష్ణా-గోదావరి నదుల్లో జలరవాణాకు సర్వే జరుగుతోందని, రాష్ట్రం సహకరిస్తే.. వచ్చేఏడాది డిసెంబర్ నాటికి బకింగ్‌హామ్ కెనాల్‌ద్వారా జలరవాణా ప్రారంభిస్తామని చెప్పారు.
‘భావనపాడు’ను ప్రైవేటీకరించవద్దు..
దేశంలో అన్ని ఓడరేవులు లాభాల్లో ఉంటే విశాఖపట్నం పోర్టు నష్టాల్లో ఉందని మంత్రి తెలిపారు. కృష్ణపట్నం పోర్టును ప్రైవేటీకరించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదన్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా భావనపాడు ఓడరేవును ప్రైవేటీకరించవద్దని, దాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తే, వచ్చేలాభాల్లో 25 శాతాన్ని రాష్ట్రానికి ఇస్తామని ఆయన ప్రతిపాదించారు.
త్వరలో బ్లూప్రింట్‌తో వస్తాం: సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. త్వరలోనే భూసేకరణ చేసి, బ్లూప్రింట్‌తో వస్తామని, కొత్త జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరారు. అమరావతి నుంచి అనంతపురం వరకు రహదారిని నిర్మించడంవల్ల రాయలసీమ వాసులు 4గంటల్లో రాజధానికొచ్చే వీలుంటుందన్నారు. ఇదే రోడ్డు ఒకవైపు కడప, మరొకవైపు కర్నూలు వెళ్లేలా నిర్మించుకోవచ్చన్నారు. తడ-ఇచ్ఛాపురం రోడ్డుకు సమాంతరంగా సముద్రతీరంలో మరొక రోడ్డును నిర్మిస్తే ఈ ప్రాంతం ప్రపంచంలోనే సుందరప్రాంతంగా ఏర్పడుతుందన్నారు. దుర్గ గుడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని వచ్చే కృష్ణా పుష్కరాలనాటికి పూర్తి చేస్తామని చెప్పారు. దీనికి ‘కనకదుర్గ ఫ్లైఓవర్’ అని నామకరణం చేశారు.
రాష్ట్రం ఇక బీద అరుపులు అరవనక్కర్లేదు: వెంకయ్యనాయుడు
రాష్ర్టం ఇక బీద అరుపులు అరవనక్కర్లేదని, భవిష్యత్తులో శక్తివంతమైన రాష్ట్రంగా మారుతుందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఇప్పటికే ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్ని కేంద్రం మంజూరు చేసిందని, ఈ నెల 19న ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేస్తున్నామని వివరించారు. దేశవ్యాప్తంగా 2.90 లక్షల ఇళ్లను మంజూరుచేస్తే అందులో ఒక్క మన రాష్ట్రానికే 1.90 లక్షల ఇళ్లు ఇచ్చామన్నారు. విజయవాడకు రూ.480 కోట్లు, గుంటూరుకు రూ.500 కోట్లను వర్షపునీటి కాల్వలు(స్ట్రామ్‌వాటర్ డ్రెయిన్లు) నిర్మించుకునేందుకు మంజూరుచేశామని తెలిపారు.
రాష్ర్టంలో జలరవాణాకు, జాతీయ రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. ప్రజలు భూములివ్వకపోతే అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. సమావేశానికి విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) అధ్యక్షత వహించారు.
రాష్ట్రంలోని జాతీయ రహదారులకు నిధులివీ..
రాష్ర్టంలో ఇప్పటికే నిర్మిస్తున్న, కొత్తగా నిర్మించబోయే జాతీయరహదారుల వివరాలను కేంద్రమంత్రి గడ్కారీ ప్రకటించారు. 2015-16లో 788 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణంకోసం రూ.8,000 కోట్లు మంజూరు చేశామని, వీటి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఇందులో అనంతపూర్- తాడిపత్రి-తోకపల్లి-నరసరావుపేట-గుంటూరు జాతీయ రహదారి(413 కి.మీ.), కర్నూలు-నందికొట్కూరు-ఆత్మకూరు-దోర్నాల జాతీయ రహదారి(125 కి.మీ.), అనంతపురం-రాజమండ్రి-విజయవాడ రోడ్డు పునర్నిర్మాణం(130 కి.మీ.), గుండుగొలను-రావులపాలెం-రాజమండ్రి రోడ్డు నిర్మాణం(120 కి.మీ.) ఉన్నాయి. ్ళ ఈ ఆర్థిక సంవత్సరంలో 1,350 కి.మీ. కొత్త జాతీయ రహదారుల్ని రూ.13,500 కోట్లతో నిర్మిస్తామని గడ్కారీ చెప్పారు.
ఇందులో కొడికొండ చెక్‌పోస్టు-లేపాక్షి- హిందూపూర్-రోలా( ఆంధ్రా, కర్ణాటక సరిహద్దు వరకు)(102 కి.మీ.), ఎన్‌హెచ్ 67(ముద్దునూరు- కడప-రేణుగుంట) రహదారి(187 కి.మీ.), మైదుకూరు- పామర్రు-సింగరాయకొండ రహదారి(242 కి.మీ.), పిడుగురాళ్ల-నరసరావుపేట-ఓడరేవు(135 కి.మీ.), జీలుగుమిల్లి-జంగారెడ్డిగూడెం-దేవరపల్లి(60 కి.మీ.), భీమవరం-రాజమండ్రి-రంపచోడవరం-చింతపల్లి-అరకు-విజయనగరం(514 కి.మీ.) ఉన్నాయి. ్ళ మరోవైపు రూ.6,211 కోట్లతో 627 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణ పనులను చేపడుతున్నట్టు మంత్రి తెలిపారు. ఇందులో కత్తిపూడి-కాకినాడ-ఒంగోలు జాతీయ రహదారికి రూ.5వేల కోట్లు, విజయవాడ నుంచి తెలంగాణ సరిహద్దు వరకున్న 221 జాతీయరహదారి నిర్మాణానికి రూ.516 కోట్లు, బళ్లారి-ఆదోని రోడ్డుకు రూ.200 కోట్లు, చిత్తూరు- కర్నూలు రోడ్డుకు రూ.160కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
అనంతపురం నుంచి కాకినాడ వరకు ఆరు లైన్ల స్వర్ణ చతుర్భుజి రహదారిని రూ.2,000 కోట్లతో రీఎలైన్‌మెంట్‌కు డీపీఆర్ తయారు చేస్తున్నట్టు తెలిపారు. రూ.800 కోట్లతో 16.5 కి.మీ. ఆరులైన్ల చిలకలూరిపేట బైపాస్‌రోడ్డు నిర్మాణానికి ఆమోదం. రాజమండ్రి వద్ద రూ.45 కోట్ల వ్యయంతో మారంపూడి ప్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపినట్టు చెప్పారు.